app: సిగ్నల్ లేకున్నా పనిచేసే యాప్... అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం
- తయారుచేసిన స్పెయిన్ నిపుణులు
- స్మార్ట్‌ఫోన్ ఎమిటర్ ద్వారా పనిచేసే యాప్
- విపత్తుల, ప్రమాదాల్లో రక్షణ చర్యలు సులభతరం
అత్యవసర పరిస్థితుల్లో సిగ్నల్ లేకున్నా పనిచేసే అప్లికేషన్ స్పెయిన్‌లోని 'యూనివర్సిడాడ్ దే అలికాంటే' పరిశోధకులు రూపొందించారు. భూకంపాలు, కార్చిచ్చులు, తుపానులు వంటి విపత్కర పరిస్థితుల్లో ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో ప్రాథమికంగా ఉండే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని ఈ యాప్ పనిచేస్తుంది. సుదూర ప్రాంతాల్లో ఫోన్ సిగ్నల్ లేని చోట్ల ఏదైనా ప్రమాదాలు సంభవించి, ఫోన్ పనిచేయకపోతే, ఈ యాప్ ఆటోమేటిక్‌గా ప్రమాదసంజ్ఞలు పంపిస్తుంది. కొన్ని కిలోమీటర్ల పరిధి మేర ఈ సంజ్ఞలు ప్రసరిస్తాయి.
స్మార్ట్‌ఫోన్‌లో ఉండే సిగ్నల్ ఎమిటర్ ద్వారా ఈ యాప్ సిగ్నల్‌ను పంపిస్తుందని, అందుకోసం ప్రత్యేకంగా నెట్వర్క్ అవసరం లేదని పరిశోధకులు జోస్ ఏంజెల్ బెర్నా తెలిపారు. ఇది పంపే సిగ్నల్‌లో ఫోన్ లొకేషన్‌తో పాటు, ప్రమాదంలో ఉన్నట్లు తెలిపే సమాచారం కూడా ఉండేలా అభివృద్ధి చేస్తున్నామని ఆమె అన్నారు. కొన్ని గంటల నుంచి రోజుల వరకు ఈ సిగ్నల్‌ను పంపిస్తూనే ఉంటుందని, దీన్ని రిసీవ్ చేసుకోవడానికి ఒకే యాంటెన్నా ద్వారా అనుసంధానించామని బెర్నా చెప్పారు.