Sachin Tendulkar: క్రికెట్ దేవుడికి మరో ‘ డ్రీమ్ సెంచరీ’ చేయాలని ఉందట.. స్వయంగా వెల్లడించిన సచిన్!
- అన్ని స్కూళ్లలోనూ క్రీడలను తప్పనిసరి చేసేందుకు ప్రయత్నిస్తానన్న సచిన్
- తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రీడల్లో ప్రాధాన్యమివ్వాలని సూచన
- ఉప రాష్ట్రపతి, క్రీడామంత్రిత్వశాఖలకు పుస్తకం అందజేత
అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసినా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు దాహం తీరినట్టు లేదు. మరో ‘డ్రీమ్ సెంచరీ’ చేయాలని ఉందంటూ మనసులోని మాటను వెల్లడించాడు. ఈనెల 21న ‘అన్ఫర్గెటబుల్ స్పోర్ట్స్ హీరోస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి, కేంద్రమానవ వనరుల, క్రీడా మంత్రిత్వ శాఖలకు సచిన్ అందజేశాడు. భారత క్రీడా దిగ్గజాలైన ధ్యాన్‌చంద్, మిల్కాసింగ్, ప్రకాశ్ పదుకొనే, అజిత్ వాడేకర్, పీకే బెనర్జీ, మేరీ కోమ్ తదితరుల వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ క్రీడలను తప్పనిసరి చేసేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర మానవ వనరుల శాఖ పనులు మొదలుపెట్టిందన్నాడు. ఇతర సబ్జెక్టులతోపాటు క్రీడలు కూడా ఉండాలనేది తన కల అని సచిన్ వివరించాడు. ఒకప్పటి తన ఫ్యాన్స్ ప్రస్తుతం తల్లిదండ్రులు అయి ఉంటారని, క్రీడాకారుల నుంచి వారు స్ఫూర్తి పొందితే తమ పిల్లలకు క్రీడల్లో ప్రాధాన్యం ఇస్తారని అన్నాడు. అదే కనుక జరిగితే అది మరో సెంచరీ చేయడమే అవుతుందని, అదే తన ‘డ్రీమ్ సెంచరీ’ అని సచిన్ వివరించాడు.