Andhra Pradesh: పని సౌలభ్యం కోసం ఇంటర్నెట్ పెడితే.. ఏపీ ఉద్యోగులు చేస్తున్న పని ఇది!
- మూడువేల ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం
- సొంత అవసరాలకు వాడుకుంటున్న ఉద్యోగులు
- సినిమాలు చూస్తూ డౌన్లోడ్
- పని కోసం వెళ్తే ఇంటర్నెట్ అందుబాటులో లేదంటూ తిప్పి పంపుతున్న వైనం
ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేస్తున్నారు. పనులను పక్కనపెట్టి అడ్డమైన పనులుకు ఉపయోగించుకుంటున్నారు. కొందరు సొంత పనుల కోసం ఇంటర్నెట్ను తెగ వాడేస్తుంటే మరికొందరు బూతు వీడియోలు చూడడం, వాటిని డౌన్లోడ్ చేయడం వంటివి చేస్తున్న విషయం తాజాగా వెల్లడైంది. ఈ విషయంలో ఎప్పటి నుంచో ఆరోపణలున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
నెలకు రూ.999కే 100 ఎంబీపీఎస్ స్పీడ్తో నెలకు 50 జీబీని ఏపీ స్టేట్ పైబర్ నెట్ కార్పొరేషన్ ప్రభుత్వ కార్యాలయాలకు అందిస్తోంది. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు ఉద్యోగులు వ్యక్తిగత అవసరాల కోసం ఇంటర్నెట్ను ఉపయోగించుకుంటున్నారు. డౌన్లోడ్లు పెరిగిపోవడంతో నెల రోజులు రావాల్సిన 50 జీబీ రెండుమూడు రోజలకే కరిగిపోతోంది.
ఏపీలోని మొత్తం మూడువేల ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయగా దాదాపు అన్నింటిలోనూ ఇదే వ్యవహారం నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలరోజుల ఇంటర్నెట్ను వారం రోజుల్లోపే ఖతం చేయడంతో అధికార పనుల కోసం వెళ్లే వారికి నెట్ అందుబాటులో లేదంటూ అధికారులు కుంటి సాకులు చెప్పి పంపించేస్తున్నారట. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇంటర్నెట్ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.