Polavaram: పోలవరం కష్టమే... నిర్మాణ సంస్థ ట్రాన్స్ ట్రాయ్ దివాలా!
- ఏపీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ
- ఆగిపోనున్న కాంట్రాక్టు పనులు
- కెనరా బ్యాంకుకు రూ. 725 కోట్లు బకాయి పడ్డ ట్రాన్స్ ట్రాయ్
- ఇన్ సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని నేషనల్ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన బ్యాంకు
2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి కనీసం గ్రావిటీ ద్వారా నీరందించాలని ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు దివాలా పిటిషన్ ను దాఖలు చేసింది. ఆ సంస్థ తమకు రూ. 725 కోట్లు బకాయి పడిందని, వెంటనే కార్పొరేట్ ఇన్ సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టి తమ బకాయిలు ఇప్పించాలని కోరింది. తమకు డిసెంబర్ 22 నాటికి రూ. 489 కోట్లు చెల్లించాల్సివుందని, ఆ మొత్తం కట్టడంలో సంస్థ విఫలమైందని పేర్కొంది.
మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఆందోళన కలిగించేలా కెనరా బ్యాంకు తీసుకున్న ఈ చర్యతో ఏపీ ప్రభుత్వం సైతం డోలాయమానంలో పడింది. ఒకవేళ నేషనల్ లా ట్రైబ్యునల్, ట్రాన్స్ ట్రాయ్ ని దివాలా తీసిన సంస్థగా ప్రకటిస్తే, పోలవరం పనులు ఎక్కడివక్కడ నిలిచే ప్రమాదం ఉంది. తిరిగి కాంట్రాక్టులను పిలవాల్సిందే. ట్రాన్స్ ట్రాయ్ కి మరే బ్యాంకు నుంచి అప్పు పుట్టదు. ప్రాజెక్టుకు కీలకమైన కాంక్రీటు పనులు క్లిష్టతరమవుతాయి. స్లిప్ వే, స్పిల్ చానల్ పనులు సాగవు.
అయితే, ఈ పరిస్థితిని చంద్రబాబునాయుడు ముందే గ్రహించి, కొత్త టెండర్లను పిలిచారని, అయితే, కేంద్ర జలవనరుల శాఖ అడ్డు పడి, ఆ ప్రక్రియను నిలిపేసిందని ఏపీ అధికారులు అంటున్నారు. వాస్తవానికి తదుపరి వర్షాకాల సీజన్ లో గోదావరికి వరదలు వచ్చే సరికి స్పిల్ వేను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, అదిప్పుడు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.