BJP: మూన్నాళ్ల ముచ్చటే... గుజరాత్ కొత్త సర్కారులో చీలిక!
- ప్రజా వ్యతిరేకత పెరిగినా అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ
- తనకు సరైన శాఖలు ఇవ్వలేదని అలిగిన డిప్యూటీ సీఎం
- కనీసం సచివాలయం వైపు చూడని నితిన్
గుజరాత్ లో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉండి, ప్రజా వ్యతిరేకత పెరిగినా, అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన బీజేపీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. విజయ్ రూపానీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నితిన్ పటేల్ తనకు ఇచ్చిన శాఖలపై కినుకుతో ఇప్పటివరకూ బాధ్యతలు స్వీకరించలేదు సరికదా, కనీసం సచివాలయం వైపు కూడా కన్నెత్తి చూడలేదు.
గతంలో నితిన్ కీలకమైన ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలను నిర్వహించగా, వాటిని ఇప్పుడాయనకు ఇవ్వలేదు. ఇదే నితిన్ అలకకు అసలు కారణంగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని ఆయన తన వర్గం ఎమ్మెల్యేల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. గతంలో తాను చూసిన శాఖలనే తిరిగి అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. నితిన్ కు ఎంతోకాలంగా జూనియర్ గా ఉన్న సౌరభ్ పటేల్ కు రెండు ముఖ్యమైన శాఖలను ఇవ్వడం కూడా నితిన్ కు ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.