vamsi: ఎందుకో తెలియదు.. ఒంటరిగా ఉండటానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను!: దర్శకుడు వంశీ
- నాకు స్నేహితులు తక్కువ
- ఒంటరిగా తిరుగుతుంటాను
- ఎవరికీ ఫోన్లు కూడా చేయను
"వంశీ గారికి స్నేహితులు ఉండరని అంటారు .. మీకు అది ఇష్టం ఉండదా .. స్నేహితులను సంపాదించుకోవడంలో ఫెయిలయ్యారా?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో వంశీకి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. "ఏమోనండీ, మొదటి నుంచి కూడా నేను ఇలాగే వున్నాను .. ఎప్పటికీ ఇలాగే వుంటాను కూడా. దీనికి ఒక బలమైన కారణమంటూ ఏమీ లేదు. చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారంతే" అన్నారు.
"ఎవరితో ఏమీ చెప్పుకోకపోవడం .. పంచుకోవడం నాకు చేతకాకపోవడమో, ఇష్టం లేకపోవడమో ఏదో వుంది మొత్తం మీద. ఖాళీగా వున్న సమయంలో స్వేచ్ఛగా .. ఒంటరిగా తిరుగుతూ వుంటాను. ఒంటరిగా వున్నప్పుడు ఎవరైనా అంతరాయం కలిగిస్తే కోపం వచ్చేది .. ఇదంతా గతంలో లెండి .. ఇప్పుడు కాదు. ఫోన్ వాడుతుంటాను .. రోజుకి రెండు .. మూడు కాల్స్ కూడా రావు. నేను ఒక కాల్ కూడా చేస్తానో లేదో తెలియదు. చాలా సేపటి నుంచి మీతో వున్నాను .. కాల్ రావడం గానీ .. నేను చేయడం గాని జరగలేదు కదా?" అంటూ తనదైన శైలిలో చెప్పారు.