North Korea: 2018లోనూ ఇదే రిపీట్ అవుద్దీ!: ఉత్తరకొరియా ప్రకటన
- 2017లో వరుసగా క్షిపణి పరీక్షలతో బెంబేలెత్తించిన ఉ.కొరియా
- మా విధానాల్లో ఎలాంటి మార్పులను అంచనా వేయద్దు
- మాపై ఎటువంటి అధికార బలం పనిచేయదు
- అమెరికా లాంటి దేశాలు మారనంత వరకు అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉంటాం
'కొత్త సంవత్సరంలో కూడా మేమింతే.. మార్పు వుండదు' అంటోంది ఉత్తర కొరియా. ఈమేరకు ఓ ప్రకటన కూడా చేసింది. 2018లోనూ తమ విధానాల్లో ఎలాంటి మార్పులను అంచనా వేయద్దని అందులో సూచించింది. అలాగే తమపై ఎటువంటి అధికార బలం పనిచేయదని, తమని ఎవ్వరూ బలహీనపరచలేరని తెలిపింది. అమెరికాతో పాటు దాని అనుబంధ దేశాల నుంచి అణు ముప్పు ఉన్నంతకాలం తాము తమ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉంటామని స్పష్టం చేసింది.
వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తూ ఉత్తరకొరియా యుద్ధ భయాన్ని రేపుతోన్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియా తీరుపై అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ ఆగ్రహంతో ఉన్నాయి. ఆయా దేశాలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఉత్తరకొరియా మాత్రం తమ తీరుని మార్చుకోకుండా ఈ ఏడాది వరుసగా క్షిపణి ప్రయోగాలు చేసింది. వచ్చే ఏడాది కూడా మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని సంకేతాలు ఇస్తోంది.