nijamabad: మంచి ప్యాకేజీతో ఇంటెల్ కంపెనీలో ఉద్యోగం పొందిన నిజామాబాద్ నిరుపేద విద్యార్థిని!
- డీడీయూజీకేవైలో శిక్షణ పొందిన విద్యార్థినిని అభినందించిన మంత్రి జూపల్లి
- బెంగుళూరులో ఉద్యోగం పొందిన విద్యార్థిని
- శిక్షణకు సాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని
దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద శిక్షణ పొందిన విద్యార్థులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఏడాదికి 6.6 లక్షల ప్యాకేజీతో మహ్మద్ ఇష్రాత్ అనే విద్యార్థినికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్‌టెల్‌లో ఉద్యోగం దక్కింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నిరుపేద విద్యార్థిని ఇష్రాత్ 2016లో బీటెక్ పూర్తి చేసింది. అనంతరం డీడీయూ జీకేవై పథకంలో భాగంగా కూకట్ పల్లిలోని జాగృతి ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీలో ఆరు నెలల శిక్షణ పొంది... క్యాంపస్ ఎంపికలో భాగంగా ఇంటెల్ సంస్థలో ఉద్యోగాన్ని దక్కించుకుంది.
అలాగే మంచిర్యాల జిల్లాకు చెందిన మరో విద్యార్థిని సహజ కూడా సినాప్సిస్‌లో 4.8 లక్షల ప్యాకేజీతో ఇప్పటికే ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరూ ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్‌లతో పాటు గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో కమిషనర్ నీతూ ప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇప్పించిన శిక్షణ ద్వారా మంచి ఉద్యోగాలను పొందగలిగామని... ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఈ శిక్షణ వల్ల ప్రయోజనం కలుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
ఏటా వేలాది మందికి డీడీయూజీకేవై ద్వారా ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని, ఈ శిక్షణను గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. వేలాది రూపాయల వ్యయం అయ్యే శిక్షణను వసతితో పాటు ఉచితంగా అందిస్తుందని తెలిపారు.
ఇప్పటివరకు 152 మందికి ఉద్యోగాలు..
తమ సంస్ధలో ఇప్పటివరకు 240 మందికి శిక్షణ ఇవ్వగా.. అందులో 152 మందికి ఉద్యోగాలు వచ్చాయని, మరో 45 మంది అపాయింట్ మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నారని జాగృతి ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజీఎంయం డైరెక్టర్ మధుకర్ బాబు, జాగృతి సంస్థ ఫ్యాకల్టీ కిరణ్, వంశీధర్‌రావు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.