girl: అంత్యక్రియలు నిర్వహిస్తుండగా కదిలిన బాలిక.. పాప మృతిపై హైడ్రామా !
- పాప బతికుండగానే మృతి చెందిందని విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యుల ధ్రువీకరణ
- ప్రాణం ఉన్నట్లు తెలిసి తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
- వైద్య పరీక్షలు చేసి మరణించినట్లు మళ్లీ ధ్రువీకరణ
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. నిన్న కళ్లు తిరిగి పడిపోయిన తమ కూతురు సాయిదుర్గ (12)ను ఆసుపత్రికి తీసుకెళ్లామని రాజరాజేశ్వరి పేటకు చెందిన ఆ చిన్నారి తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. మొదట తమ కూతురు కోమాలో ఉందని తెలిపిన వైద్యులు ఆ తరువాత కొద్ది సేపటికే మృతి చెందిందని చెప్పి మరణ ధ్రువీకరణ పత్రాన్ని అంబులెన్స్ డ్రైవర్‌కి ఇచ్చి, పాప మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లమని చెప్పారని తెలిపారు.
ఇంటికి వెళ్లిన తరువాత డబ్బులు ఇవ్వలేదని మరణ ధ్రువీకరణ పత్రం తమకు ఇవ్వకుండానే అంబులెన్స్ డ్రైవర్ వెళ్లిపోయాడని తెలిపారు. అయితే, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా సాయిదుర్గలో కదలిక వచ్చిందని, ప్రాణం ఉన్నట్లు తెలిసి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లామని అన్నారు. అయితే ఆ ఆసుపత్రిలో చేర్చుకోలేదని, దాంతో తిరిగి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చామని, ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి మళ్లీ మరణించినట్లు ప్రకటించారని చెప్పారు. తమ పాపకు పోస్టు మార్టం జరపవద్దని ఆమె కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.