dinakaran: వెళ్లాల్సిన చోటికే దినకరన్ వెళతారు.. ఆయనది మూన్నాళ్ల ముచ్చటే!: పళనిస్వామి
- పార్టీలోకి దొడ్డి దారిలో ప్రవేశించారు
- పదవిలో ఎక్కువ కాలం ఉండలేరు
- సొంత కుటుంబం కోసం పాకులాడుతున్నారు
మూడు నెలల్లో తమ ప్రభుత్వం కూలిపోతుందంటూ అన్నాడీఎంకే తిరుగుబాటు నేత దినకరన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మండిపడ్డారు. ఇదే సమయంలో దినకరన్ ఎక్కడకు వెళ్లాలో అక్కడికే వెళతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజల కోసం పాటుపడుతుంటే... దినకరన్ సొంత కుటుంబం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కార్యకర్త స్థాయి నుంచి తాము అన్నాడీఎంకే కోసం పని చేశామని... దినకరన్ మాత్రం దొడ్డి దారిలో పార్టీలోకి ప్రవేశించారని అన్నారు. ఆర్కే నగర్ లో దినకరన్ విజయం సాధించడానికి కారణం హవాలా ఫార్ములానే అని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన దినకరన్ ఆ పదవిని కొంత కాలం మాత్రమే అనుభవించగలరని అన్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా దినకరన్ పై మండిపడ్డారు. అన్నాడీఎంకేలో తాను సీనియర్ నని, దినకరన్ ఓ ఎల్ కేజీ విద్యార్థిలాంటి వాడని ఎద్దేవా చేశారు. జయలలిత చేత పార్టీ నుంచి బహిష్కరింపబడిన వారు ఇప్పుడు పార్టీపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2008లోనే దినకరన్ ను బహిష్కరించారని చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ చేస్తున్న యత్నాలు ఫలించవని అన్నారు.