Rajinikanth: మరికొన్ని గంటల్లో వీడిపోనున్న మిస్టరీ.. రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్న రజనీకాంత్.. ఎప్పుడు ఏమన్నారంటే?
- ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దేశం
- రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్న ‘తలైవా’
- నేడు ప్రకటించనున్నట్టు వారం క్రితమే చెప్పిన సూపర్ స్టార్
తమిళనాడు.. ఆ మాట కొస్తే దేశం మొత్తం ఈ రోజు కోసమే ఎదురుచూస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు తన రాజకీయ ప్రణాళికను ప్రకటించనున్నారు. రజనీ రాజకీయ అరంగేట్రంపై గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. జయలలిత మరణం తర్వాత ఇవి మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులతో పలుమార్లు చర్చలు జరిపిన రజనీకాంత్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తన రాజకీయ భవితవ్యాన్ని నేడు ప్రకటించనున్నారు. ఈ మేరకు కొన్ని రోజుల క్రితమే ఆయన ప్రకటించారు. దీంతో డిసెంబరు 31 కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ వస్తున్న డిమాండ్లు ఈనాటి కావు. మూడు నాలుగు దశాబ్దాలుగా ఆయన అభిమానులు పదేపదే కోరుతున్నారు. 1980 నుంచి ఇవి మరింత ఊపందుకున్నాయి. ఆ ఏడాది రజనీ నటించిన ‘మరట్టు కాలై’ సినిమా విడుదలై సంచలన విజయం నమోదు చేసింది. ఈ సినిమా విడుదల తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.
1992లో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న తన వాంఛను బహిరంగంగా బయటపెట్టారు. ‘‘నిన్న నేను బస్ కండక్టర్‌ను. నేడు సూపర్ స్టార్‌ని. రేపేం జరగబోతోందో’’ అని ప్రకటించి సంచలనం రేపారు.
1996లో అన్నాడీఎంకే అధికారంలో ఉండగా రజనీకాంత్ మాట్లాడుతూ ‘‘జయలలిత కనుక అధికారంలోకి వస్తే తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో తమిళ ప్రజలు అన్నాడీఎంకేకు షాకిచ్చారు. డీఎంకే-టీఎంసీ కూటమికి పట్టం కట్టారు.
2002లో కావేరీ నదీ జలాల వివాద పరిష్కారం కోసం ఓ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.
2014లో రజనీ తన రాజకీయ అరంగేట్రంపై మాట్లాడుతూ.. తాను రాజకీయాల గురించి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానని, రాజకీయాల్లోకి రావాలా?వద్దా? అనే విషయాన్ని భగవంతుడే నిర్ణయిస్తాడని పేర్కొన్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయాలు కొత్త కాదని, ఇప్పటికే ఆలస్యం చేశానని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే విజయం సాధించినట్టేనని, డిసెంబరు 31న తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీకాంత్ స్పష్టం చేశారు.