technolgy: 2017లో చరిత్రలో కలిసిపోయిన టెక్నాలజీలు
- విండోస్ ఫోన్ నుంచి యాపిల్ ఐపాడ్ నానో వరకు
- ఒకప్పుడు ఇవి వెలుగు వెలిగినవే
- పలు కారణాలతో ముగింపు
కాలచక్రంలో ఎన్నో ఏళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ విధంగా 2017 సంవత్సరంలో కనుమరుగైన టెక్నాలజీలు, గ్యాడ్జెట్లు కొన్ని ఉన్నాయి. ఒకప్పుడు ఇవి ఓ వెలుగు వెలిగినవే.
విండోస్ ఫోన్
విండోస్ ఫోన్ గురించి తెలుసు కదా. మైక్రోసాఫ్ట్ దీని యజమాని. ఎట్టకేలకు ఈ ఫోన్ కథ ముగిసిపోయిందని మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది ఈ ఏడాదే. విండోస్ మొబైల్ కు ఇకపై ఎటువంటి ఫీచర్స్, హార్డ్ వేర్ ను మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేయదని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జోయ్ బెల్ ఫోర్ ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఫోన్లను కొనుగోలు చేసిన వారికి సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తామని, బగ్ లు ఉంటే సరిచేస్తామని తెలిపారు.
3డీ టీవీ
టెలివిజన్లలో 3డీ టీవీ టెక్నాలజీ ఓ సంచలనం. కొన్ని సంవత్సరాల క్రితం దీనిపై పెద్ద ఆసక్తి. కానీ, 2017లో దీని కథ దాదాపు ముగిసిపోయింది. ఎల్జీ, సోనీ సంస్థలు 3డీ టెక్నాలజీ టీవీలకు సపోర్ట్ నిలిపివేశాయి. మరో పెద్ద బ్రాండ్ శ్యామ్ సంగ్ సైతం 3డీ టీవీలకు సేవలను 2016లోనే నిలిపివేసింది.
యాపిల్ ఐపాడ్ షఫిల్, ఐపాడ్ నానో
చాలా బాగా ఆదరణ పొందిన యాపిల్ ఉత్పత్తులు ఐపాడ్ నానో, ఐపాడ్ షఫిల్ 2017లోనే ఆగిపోయాయి. ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో రెండేళ్లుగా వీటికి సంబంధించి ఎటువంటి అప్ డేట్స్ లేవు.
20 ఏళ్ల ప్రయాణం ఏవోఎల్
ఏవోఎల్ ఇన్ స్టంట్ మెస్సెంజర్ సర్వీసు 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత డిసెంబర్ 15 నుంచి నిలిచిపోయింది. ఇకపై ఇది పనిచేయదని కంపెనీ ప్రకటించింది.
గూగుల్ క్రోమ్ యాప్స్
గూగుల్ 2017 డిసెంబర్ లో విండోస్, మ్యాక్, లైనక్స్ వెర్షన్లకు సంబంధించిన క్రోమ్ యాప్స్ సెక్షన్ మూసేసింది. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కు మాత్రం పనిచేస్తుంది.
జీటాక్
జీటాక్ మెస్సేంజర్ ప్లాట్ ఫామ్ 2005లో ప్రారంభం కాగా, 2017లో దీని కథ ముగిసిపోయింది. జీటాక్ స్థానంలో గూగుల్ హ్యాంగవుట్స్ సర్వీస్ 2013లోనే ప్రారంభమైంది.