raghuveera reddy: చంద్రబాబు అంటే ఏమిటో 2017లో పూర్తిగా అర్థమైంది: రఘువీరారెడ్డి

  • ప్రచారం తప్ప, అభివృద్ధి లేదు
  • 2017 చంద్రబాబు వైఫల్యనామ సంవత్సరం
  • బాబు డొల్లతనం ఎన్నోసార్లు బయటపడింది

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శలు గుప్పించారు. 'బాబు వస్తే జాబు' అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడికి మంత్రి ఉద్యోగం ఇచ్చారని ఆయన సెటైర్ వేశారు. 2017 చంద్రబాబు వైఫల్యనామ సంవత్సరంగా ముగిసిందని అన్నారు. మూడున్నరేళ్ల చంద్రబాబు పాలన ప్రచారపు ఆర్భాటంగానే సాగిందని... అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించలేదని చెప్పారు.

ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారని, నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి అటకెక్కిందని విమర్శించారు. డ్వాక్రా రుణాలదీ అదే తంతు అని అన్నారు. ప్రత్యేక హోదాపై ఎన్నిసార్లు మాట మార్చాలో అన్నిసార్లు మార్చారని ధ్వజమెత్తారు.

ఐటీ రంగాన్ని పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు చెప్పుకున్నారని... గత మూడున్నరేళ్లలో చెప్పుకోదగ్గ ఓ ఐటీ కంపెనీ కూడా ఏపీకి రాలేదని రఘువీరా అన్నారు. గూగుల్ కంపెనీ వస్తోందని ప్రచారం చేసుకున్నారని... అది కూడా బోగస్ అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇసుక ఓ పెద్ద స్కాంలా మారిపోయిందని చెప్పారు. తాత్కాలిక సచివాలయం ఒక పెద్ద ఫెయిల్యూర్ అని... చిన్నపాటి వర్షానికే ఛాంబర్లు వర్షపు నీటితో నిండిపోయాయని అన్నారు. విధానపరమైన నిర్ణయాలలో చంద్రబాబు డొల్లతనం ఎన్నోసార్లు బయటపడిందని అన్నారు. చంద్రబాబు అంటే ఏమిటో 2017లో పూర్తిగా అర్థమైందని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News