KTR: ఇతను రియల్ ‘బాహుబలి’ అంటూ ఫారెస్ట్ గార్డును ప్రశంసించిన కేటీఆర్!
- తమిళనాడు అటవీ ప్రాంతంలో చిన్న గుంటలో పడిపోయిన ఏనుగుపిల్ల
- ఆ ఏనుగుపిల్లను తన భుజాలపై మోసుకొచ్చిన ఫారెస్ట్ గార్డు
- ‘బీబీసీ ఆసియా’లో ప్రచురితమైన ఆ వార్త గురించి ప్రస్తావన.. ఫారెస్ట్ గార్డుపై ప్రశంసలు
గుంటలో పడిపోయి, తిండి లేక నీరసించిపోయిన ఓ ఏనుగు పిల్లను రక్షించి, దానిని తన తల్లి వద్దకు చేర్చిన తమిళనాడులోని ఫారెస్ట్ గార్డు శరత్ కుమార్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అతను రియల్ ‘బాహుబలి’ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేటీఆర్ ప్రశంసించారు. ఇందుకు సంబంధించి ‘బీబీసీ ఆసియా’లో వచ్చిన వార్తను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
తన పిల్ల గుంతలో పడిపోవడంతో దానిని కాపాడమంటూ ఏనుగు తల్లి ఆ రోడ్డుపైనే బైఠాయించింది. ఏనుగు పిల్లను కాపాడేందుకు ఫారెస్ట్ గార్డు తన సహచర ఉద్యోగులతో కలిసి శ్రమించి దానిని బయటకు తీసుకొచ్చారు. హిల్ స్టేషన్ ఊటీకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే మెట్టుపాళ్యంలోని ఫారెస్ట్ శాఖలో పనిచేస్తున్న శరత్ కుమార్ ఈ సంఘటన గురించి వివరించారు.
‘డిసెంబర్ 12న నైట్ డ్యూటీ నిమిత్తం విధుల్లో ఉన్నాను. ఆరోజు రాత్రి ఒక వ్యక్తి ఫోన్ చేసి, వనభద్రకాళీ అమ్మను ఆలయం వద్ద రోడ్డుపై ఒక ఆడ ఏనుగు అడ్డంగా ఉందని చెప్పాడు. దీంతో, సహచర ఉద్యోగులతో కలిసి నేను ఆ ప్రాంతానికి వెళ్లాను. టపాసులు కాల్చి భయపెట్టడం ద్వారా రోడ్డుపై బైఠాయించిన ఆ ఏనుగును అడవిలోకి వెళ్లగొట్టాం. అయితే, ఇతర ఏనుగులు కూడా ఏవైనా అక్కడ ఉన్నాయేమోనని వెతికాం.
ఈ క్రమంలో ఏనుగు పిల్ల ఒకటి చిన్న గుంతలో పడి ఉండటాన్ని గమనించాం. తిండి లేక అలసిపోయిన ఆ పిల్ల ఏనుగు తికమకపడుతోంది. మా బృందం దాని దగ్గరకు వెళ్లి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. మొదట మేము నలుగురం కలిసి పిల్ల ఏనుగును మోసుకొచ్చే ప్రయత్నం చేశాం. వేరే మార్గం ద్వారా రోడ్డుపైకి తీసుకొచ్చి, దాని తల్లి వద్ద వదిలి పెడదామనుకున్నాం. ఒకవేళ తల్లి ఏనుగు కనుక దాడి చేస్తుందేమోననే ఆలోచన వచ్చి భయపడ్డాం. అలా మేము నలుగురం ప్రమాదంలో పడటమెందుకులే అని ఆలోచించి, నేను ఒక్కడినే నా భుజాలపై మోసుకుని రోడ్డు దాటాను. అయితే, బ్యాలెన్స్ కోల్పోతానేమోనని మొదట భయపడ్డాను.
కానీ, నా పక్కనే ఉన్న సహచర ఉద్యోగుల సాయంతో దానిని రోడ్డుపైకి చేర్చాను. ఏనుగు పిల్ల చాలా బరువుగా ఉంది. అంత బరువు ఉన్నప్పటికీ ఆ క్షణంలో దానిని పైకి ఎత్తగలిగాను. అక్కడికి ఏనుగు పిల్ల తల్లి వస్తుందేమోనని చెప్పికొంత దూరం మోసుకొచ్చిన తర్వాత ఒక నీటి గుంట వద్ద ఆగాం. కొన్ని గంటల పాటు వేచి చూశాం కానీ, దాని తల్లి రాలేదు. మేము అక్కడే ఉంటే ప్రమాదమని భావించి వెళ్లిపోయాం.
తర్వాత అదే చోటుకి మర్నాడు వెళ్లి చూశాం. కానీ, పిల్ల ఏనుగు అక్కడ లేదు. పెద్ద ఏనుగు పాదాల గుర్తులు అక్కడ ఉండటం గమనించాం. తన పిల్లను తల్లి ఏనుగు వచ్చి తీసుకెళ్లిందని మేము భావించాం’ అని శరత్ కుమార్ చెప్పారు. అంత బరువున్న ఆ ఏనుగు పిల్లను పైకెలా ఎత్తగలిగావు? అంటూ గ్రామస్తులతో పాటు ఈ దృశ్యాలను వీడియోలో, సోషల్ మీడియాలో చూసిన పలువురు తనను ప్రశ్నిస్తున్నారని శరత్ కుమార్ నవ్వుతూ చెప్పారు.