Nitin Patel: అనుకున్నది సాధించిన నితిన్ పటేల్.. అలకవీడిన వైనం!
- నితిన్ పటేల్‌కు ఆర్థిక శాఖ కేటాయించినట్టు ప్రకటించిన సీఎం
- అమిత్ షా రంగంలోకి దిగడంతో సమస్య కొలిక్కి
- బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం
మొత్తానికి గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అనుకున్నది సాధించారు. ముఖ్యమైన శాఖలు తనకు దక్కనందుకు అలకబూనిన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించకుండా ఉండిపోయారు. ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులైనా కాకముందే లుకలుకలు బయటపడడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన నచ్చజెప్పడంతో నితిన్ పటేల్ శాంతించారు. ఆర్థిక శాఖ ఇస్తామని చెప్పడంతో చల్లబడిన ఆయన డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకొచ్చారు. అమిత్ షా తనతో మాట్లాడారని, డిప్యూటీ సీఎం సహా తన స్థాయికి సరిపడే మరో రెండు మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చారని నితిన్ పటేల్ మీడియాకు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన నియోజకవర్గమైన మెహసానా వెళ్లి మద్దతుదారులను కలిశారు. ఆ వెంటనే సీఎం రూపానీ మాట్లాడుతూ నితిన్ పటేల్‌కు ఆర్థిక శాఖ కేటాయించినట్టు పేర్కొన్నారు. కాగా, అంతకుముందు నితిన్ పటేల్ మాట్లాడుతూ.. ఏ మంత్రి పదవి ఇస్తారన్నది తనకు ముఖ్యం కాదని, ఆత్మగౌరవమే ముఖ్యమని పేర్కొన్నారు. తనకు గౌరవనీయమైన పదవులు ఇవ్వాలని, లేదంటే కేబినెట్ నుంచి తొలగించాలని అధిష్ఠానానికి తేల్చి చెప్పినట్టు పటేల్ వివరించారు. బీజేపీకి తాను 40 ఏళ్లుగా విశ్వాసపాత్రుడిగా, క్రమ శిక్షణ కలిగిన సైనికుడిలా ఉన్నానని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో ఆర్థిక, పట్టణాభివృద్ధితోపాటు పలు శాఖలు నిర్వహించిన పటేల్‌కు ఈసారి ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించారు. దీంతో అలకబూనిన ఆయన బాధ్యతలు స్వీకరించలేదు.