Drunken Drive: మందు కొట్టి దొరికిపోయింది చాలా తక్కువ మందే... హైదరాబాద్ లో తగ్గిన మందుబాబులు!
- ఫలించిన పోలీసుల ముందస్తు హెచ్చరికలు
- మందు కొట్టి వాహనాలు నడిపింది చాలా తక్కువ మందే
- 30 వేల మందిని తనిఖీలు చేస్తే, పట్టుబడింది 1683 మంది
- ప్రజల్లో అవగాహన పెరిగిందంటున్న పోలీసులు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ముందుగానే చేసిన హెచ్చరికలు ఫలించాయి. మద్యం తాగి వాహనాలు నడిపిన వారి సంఖ్య గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణం. జంటనగరాల పరిధిలో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకూ స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ ను నిర్వహించగా, పలువురు పట్టుబడ్డారు. సుమారుగా 30 వేల మందిని పోలీసులు తనిఖీలు చేయగా, 1683 మంది మాత్రమే పట్టుబడ్డారు.
అంటే డిసెంబర్ 31న పోలీసులు తనిఖీలు చేసిన వాహనాల్లో మద్యం తాగి ఉన్నట్టు తేలింది 10 శాతం కన్నా తక్కువే. ఇంకా చెప్పాలంటే, 5 శాతానికి కాస్తంత ఎక్కువ. రెండేళ్ల క్రితం ఇదే సమయంలో పరీక్షలు జరిపిన ప్రతి ఐదుగురిలో ఒకరు మందు కొట్టి దొరికిపోయిన పరిస్థితి. నిన్న రాత్రి మొత్తం 1309 బైకులు, 86 ఆటోలు, 276 కార్లను పోలీసులు సీజ్ చేశారు. తమకు పట్టుబడిన వాహనాలను స్టేషన్లకు తరలించడంలో పోలీసులు నానా ఇబ్బందులూ పడ్డారు.
ఇక గతంతో పోలిస్తే, ఈ సంవత్సరం ఎక్కువ మంది దొరికినట్టు కనిపిస్తున్నా, తనిఖీలు ఎక్కువ ప్రాంతాల్లో జరగడం, బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసిన సంఖ్యను చూస్తే, ప్రజల్లోనూ అవగాహన పెరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు.