Pawan Kalyan: పవన్-కేసీఆర్ భేటీ.. చరిత్రను తిరగేసిన వర్మ!
- కేసీఆర్‌ను కలిసిన పవన్ కల్యాణ్
- గత చరిత్రను తవ్వి తీసిన వర్మ
- అవసరం మనుషులను మార్చేస్తుందంటూ సెటైర్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తానెందుకు స్పెషలో మరోమారు నిరూపించుకున్నాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఆయన నివాసంలో కలిశారు. ఇప్పుడీ విషయం అటు ఏపీ, ఇటు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు తాను ముఖ్యమంత్రిని కలిసినట్టు పవన్ చెబుతున్నప్పటికీ వీరి భేటీ వెనక ‘ఇంకేదో’ ఉందని చెబుతున్నారు.
యథావిధిగా వీరి భేటీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కంట్లో పడింది. ఇంకేముంది, తనదైన స్టయిల్లో పోస్ట్ చేసి కాకరేపాడు. గత చరిత్రను తిరగేశాడు. పవన్ గతంలో ఓ సభలో చేసిన వ్యాఖ్యలను.. పవన్‌పై కేసీఆర్ వేసిన సెటైర్లను గుర్తు చేస్తూ రాజకీయాలంటే ఇలానే ఉంటాయని చెప్పకనే చెప్పాడు.
ఓ సభలో పవన్ మాట్లాడుతూ ‘ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా’ అనగా, ‘ఆడి పేరేందిరా బై’ అని కేసీఆర్ ఓ బహిరంగ సభలో అడుగుతూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలను యథాతథంగా పోస్టు చేసి.. అవసరం, సమయం రాజకీయ నాయకులను మార్చేస్తుందని, 'జై రాజకీయ నాయకుల్లారా..' అంటూ కేసీఆర్‌కి పవన్ శుభాకాంక్షలు చెబుతున్న ఫొటోను పోస్టు చేశాడు.