Osmania University: ప్రభుత్వ తప్పుడు నివేదికలతో గొప్ప అవకాశాన్ని కోల్పోయాం.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఓయూ విద్యార్థుల పిల్
- ప్రభుత్వ తీరుతో ఇండియన్ కాంగ్రెస్ మరో చోటికి తరలిపోయింది
- మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమై కేంద్రానికి తప్పుడు నివేదికలు
- ప్రభుత్వ తీరుతో ఓయూ ప్రతిష్ఠ మసకబారింది
- హైకోర్టులో ఓయూ విద్యార్థుల పిల్
ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివేదికల వల్ల అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను ఉస్మానియా యూనివర్సిటీలోనే నిర్వహించేలా, పూర్తి సహకారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అందులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇవ్వడంతో ఇక్కడ నిర్వహించాల్సిన ‘సైన్స్ కాంగ్రెస్’ మరో చోటికి తరలిపోయిందని పిల్లో పేర్కొన్నారు. సమావేశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందని విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఓయూ వీసీ, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఏడు దశాబ్దాలుగా ప్రతి ఏటా జరుగుతున్నట్టు పేర్కొన్న విద్యార్థులు, ప్రభుత్వ తీరుతో డబ్బు, శ్రమ, విద్యార్థుల ప్రయోజనాలు అన్నీ వ్యర్థమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక యూనివర్సిటీ ప్రతిష్ఠ మసకబారిందని అన్నారు.
నిజానికి ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ జరగాల్సి ఉంది. ఇందుకోసం 13 వేల మంది శాస్త్రవేత్తలు రిజిస్టర్ కూడా చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సైన్స్ కాంగ్రెస్ జరిగి ఉంటే యూనివర్సిటీకి రూ.300 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగి ఉండేదని, అయితే ప్రభుత్వం తీరు వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.