Pakistan: అమెరికాపై జిహాద్ ప్రకటిస్తున్నాను: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్
- పాకిస్థాన్ ఇక అణుబాంబును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది
- అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌పై కూడా జిహాద్
- లాహోర్‌లో హఫీజ్ సయీద్ ర్యాలీ
ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ట్వీట్ చేస్తూ మండిపడ్డ విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు సుమారు 33 బిలియన్ డాలర్లకు పైగా అమెరికా ఇచ్చిందని, కానీ పాక్ మాత్రం తమ దేశాన్ని మోసం చేస్తూ అసత్యాలు చెప్పిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది, 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ పాక్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన హఫీజ్ సయిద్.. అమెరికాపై జిహాద్ (పవిత్ర యుద్ధం) ప్రకటిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ ఇక అణుబాంబును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. అమెరికాతో పాటు తాను ఇజ్రాయిల్‌పై కూడా జిహాద్ ప్రకటిస్తున్నట్లు తెలుపుతూ లాహోర్‌లో ఆయన ర్యాలీ చేపట్టాడు. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశాడు.