paruchuri: ‘పరుచూరి బ్రదర్స్‌ను ఊచకోత కోస్తా’ అని శోభన్ బాబు ఆగ్రహంగా అన్నారు: పరుచూరి గోపాలకృష్ణ
- నాటి చిత్రం ‘మహా సంగ్రామం’ గురించి ప్రస్తావించిన పరుచూరి
- ఈ సినిమాలో శోభన్ బాబు పాత్ర నిడివి తగ్గిపోయింది
- అసలు విషయం తెలియని ఆయన మాపై మండిపడ్డారట
- ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ
గతంలో విడుదలైన ‘మహా సంగ్రామం’ చిత్రం కారణంగా నటుడు శోభన్ బాబుకు, తమకు మధ్య పెద్ద అగాధం ఏర్పడిందని ఆ చిత్రానికి కథ, మాటలు అందించిన పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’లో భాగంగా పోస్ట్ చేసిన వీడియోలో గోపాలకృష్ణ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
‘శోభన్ బాబు గారు చాలా సాత్వికుడు కదా.. ఆయనకు, మాకు మధ్య అగాధం రావడమేంటని చాలామంది అనుకుంటారు. 1984లో వచ్చిన ‘మహాసంగ్రామం’ సినిమా సమయంలో మా ఇద్దరు (పరుచూరి బ్రదర్స్) గురించి శోభన్ బాబు గారు ‘ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్ (పరుచూరి బ్రదర్స్ ని ఊచకోత కోస్తా)’ అనే ఒక మాట వాడారు. ఆయన ఇలా అన్నట్లు మాకెవరో చెప్పారు.
విషయం మాకు అర్థం కాలేదు..మమ్మల్ని ఆయన ఇలా అనడమేంటని! దీని వెనుక కథేంటంటే.. మహాసంగ్రామం సినిమా కథ నిజానికి ఒక హీరో కథ. ఆ హీరో ఎన్టీఆర్ గారు. ఈ కథ ఆయనకు చెప్పాం. ‘చాలా బాగుంది బ్రదర్.. చూద్దాం’ అని ఆయన అన్నారు. ఇంత బాగున్న కథను చూద్దామని అన్నారేంటని అనుకుని.. ‘అన్నగారూ! రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నారా?’ అని అడిగాం. ‘రాజకీయాల్లోకి వెళ్లే వాళ్లు నిజాలు చెప్పొచ్చా? అని ఎన్టీఆర్ గారు మాతో అన్నారు. ‘చెప్పకూడదండి’ అని మేము అనడంతో.. ‘అయితే, మేమూ చెప్పం’ అని అన్న గారు సమాధానమిచ్చారు. అయితే, ఇదే కథను తిరుపతిరెడ్డి గారు విని, 'ఈ కథను ఇద్దరు హీరోల మీదకు మార్చగలరా?' అని అడిగారు.
అప్పుడు, కృష్ణ, శోభన్ బాబు గారిపైకి ఈ కథను మార్చాం. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అంత బాగా వచ్చిన సినిమాలో నుంచి మూడువేల అడుగుల నిడివి గల శోభన్ బాబు గారి పాత్ర పోయింది. ఈ సినిమాలో శోభన్ బాబు గారు మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కన్పిస్తారు. ఆయన మిలిటరీలో ఉండగా చిత్రీకరించిన కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అయితే, ఈ సినిమా సెన్సార్ చేసేటప్పుడు ఒక మిలిటరీ ఆఫీసర్ కూడా వచ్చారు.
‘ఉయ్ ఓంట్ ఎలో’ అని చెప్పి ఆ సీన్స్ అన్నింటిని కట్ చేశారు. దీంతో, ఆ సినిమాలో కృష్ణ గారి వేషం ఎక్కువగా ఉండి.. శోభన్ గారి వేషం తగ్గిపోయింది. ఆ సినిమాలో తన పాత్ర ఎందుకు తగ్గిపోయిందో తెలియకపోవడంతో శోభన్ బాబుగారు మాపై ఆ మాట వాడేశారు. అసలు విషయం రెండేళ్ల తర్వాత తెలుసుకున్న శోభన్ బాబు గారు ‘సారీ, తిరుపతిరెడ్డి గారు చెప్పారు’ అని అనడంతో మా మధ్య ఉన్న అగాధం తొలగిపోయింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.