Sankranthi: సంక్రాంతిపై గందరగోళం.. ఇంతకీ పండగ ఎప్పుడు?.. పంచాంగకర్తల మధ్య భేదాభిప్రాయాలు!
- సంక్రాంతి విషయంలో భిన్నాభిప్రాయాలు
- ప్రజల్లో అయోమయం
- 14నే జరుపుకోవాలన్న ధృక్ పంచాంగం
- 15నే అంటున్న గంటల పంచాంగం
పండుగల విషయంలో ఇటీవల పంచాంగకర్తల మధ్య తరచూ భేదాభిప్రాయాలు వస్తున్నాయి. కృష్ణా పుష్కరాల నుంచి ఉగాది వరకు ఇలా ప్రతీదీ వివాదాస్పదమవుతూనే ఉంది. ఒకరు ఒక రోజున చేయాలంటే మరొకరు ఇంకో రోజున చేయాలంటూ వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి విషయంలోనూ మరోమారు పంచాంగకర్తల మధ్య భేదాభిప్రాయాలు పొడసూపాయి. పండుగ ఎప్పుడు అన్నదానిపై ఎవరికి వారే భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
జనవరి 14న మధ్యాహ్నం 1:46 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ రోజే మకర సంక్రాంతి అని ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు చెబుతున్నారు. భారత సిద్ధాంత పంచాంగం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని అంటున్నారు. అయితే సంకాంత్రి 14న కాదని, ఆ రోజు సాయంత్రం 7:43 గంటలకు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఆ మర్నాడే మకర సంక్రమణ ప్రయుక్త పుణ్యకాలమని మరికొందరు పంచాంగకర్తలు వాదిస్తున్నారు. క్యాలెండర్లు అన్నీ 15నే మకర సంక్రాంతి అని ప్రచురించాయి. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ జరుపుకోవాలని గంటల పంచాంగాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా 14న భోగి, 15 సంక్రాంతి అని సెలవుల జాబితాలో పేర్కొంది.