Jayalalitha: జయలలిత ఆసుపత్రి వీడియోపై వంద ప్రశ్నలు.. ఉక్కిరిబిక్కిరి అయిన శశికళ మేనకోడలు
- ఏకసభ్య కమిషన్ ఎదుట హాజరైన కృష్ణ ప్రియ
- ఎన్ని వీడియోలు తీశారు? ఎవరు తీశారంటూ ప్రశ్నల వర్షం
- వాంగ్మూలంగా నమోదు చేసుకున్న జస్టిస్ అర్ముగస్వామి
ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ముందు బయటకు వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వీడియోపై జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ వేసిన ప్రశ్నలకు శశికళ మేనకోడలు కృష్ణప్రియ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వందకుపైగా ప్రశ్నలు సంధించడంతో సమాధానాల కోసం తడబడ్డారు.
జయలలిత మృతిపై అనుమానాలు రేకెత్తడంతో ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను నియమించింది. ఇప్పటికే పలువురిని విచారించిన అర్ముగస్వామి ఎదుట తాజాగా శశికళ మేనకోడలు కృష్ణ ప్రియ హాజరయ్యారు.
జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తీసిన వీడియో గురించి అర్ముగస్వామి వందకు పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. జయ వీడియోను తీసింది ఎవరు? శశికళ తీశారా?.. లేక మరెవరైనా తీశారా? ఎన్ని వీడియోలు తీశారు? అన్న ప్రశ్నలకు కృష్ణ ప్రియ నుంచి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఆమె ఇచ్చిన సమాధానాలను వాంగ్మూలంగా నమోదు చేసుకుని సంతకాలు కూడా తీసుకున్నారు.
మరోవైపు జయలలితకు ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలతోపాటు, ఇటీవల బయటకొచ్చిన వీడియో ఉన్న పెన్డ్రైవ్ను అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ తరపు న్యాయవాది విచారణ సంఘానికి సమర్పించారు.