bitcoin: బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోగొట్టుకున్నట్టే?
- ప్రభుత్వం నిషేధించే అవకాశం
- అలా చేస్తే పెట్టుబడులు పొందలేని పరిస్థితి
- బిట్ కాయిన్ అంటే ఏంటో తెలియకుండానే పెట్టుబడులు
బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...? అయితే, మీ పెట్టుబడులు నిలిచిపోయినా ఫర్వాలేదనుకుంటేనే ముందడుగు వేయండి. ఎందుకంటే బిట్ కాయిన్ తరహా క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. క్రిప్టో కరెన్సీలకు దూరంగా ఉండాలంటూ కేంద్ర సర్కారు తరచుగా హెచ్చరిస్తూ వస్తోంది. అయినా ఇన్వెస్టర్లు ఆ మాటలను తలకెక్కించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం, ఆర్ బీఐ హెచ్చరికలు ఈ విషయంలో కఠిన విధానం, నియంత్రణ పరమైన చర్యలకు సంకేతం ఇస్తోందని పైసాబజార్ సీటీవో జగ్మాల్ సింగ్ పేర్కొన్నారు.
‘‘క్రిప్టో కరెన్సీలకు ఉన్న అతిపెద్ద రిస్క్ ఏమిటంటే నియంత్రణ పరమైన పర్యవేక్షణ లేకపోవడం. సమీప భవిష్యత్తులో ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ లను నిషేధించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇలా చేస్తే ఇన్వెస్టర్లు డిజిటల్ కరెన్సీల్లో చేసిన పెట్టుబడులు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అని జగ్మాల్ సింగ్ వివరించారు.
ఇన్వెస్టర్లు తాము అర్థం చేసుకోని, చేసుకోలేని వాటి జోలికి వెళ్లొద్దని సింగ్ సూచించారు. ‘‘పెట్టుబడులకు సంబంధించిన ప్రాథమిక సూత్రం... ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నదీ తెలుసుకోవడం. దురదృష్టవశాత్తూ చాలా మంది క్రిప్టో కరెన్సీలను, వాటి వెనుకనున్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అర్థం చేసుకోలేదు. తక్షణం లాభాల కోసం ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందరూ వెర్రిగా ఇన్వెస్ట్ చేస్తున్నందున చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని సింగ్ సూచించారు.