paripoornananda: అసలు క్షుద్రపూజలు అనేవే లేవు: దుర్గగుడి ఘటనపై స్వామి పరిపూర్ణానంద స్పందన
- ఒకవేళ అవి ఉన్నవని కొందరు నమ్మితే వాటిని కేవలం శ్మశానాల్లో చేసుకుంటారు
- సూర్యకుమారి గుడిలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
- ఈ సంఘటన ఎన్నో అనుమానాలకు తావు ఇస్తోంది
- ఇలా పాలకమండలిపై ప్రభుత్వం అత్యుత్సాహం ఎందుకు?
దుర్గగుడి ఆలయంలో క్షుద్రపూజలు చేశారన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణ కూడా జరుపుతోంది. ఆలయ ప్రధాన అర్చకుని వెంట ఆజ్ఞాతవ్యక్తి ఒకరు అంతరాలయం వరకు వచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుర్గ గుడి ఈవోను బదిలీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. వీటిపై రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద స్పందించారు.
"దుర్గ గుడి ఈవోను బదిలీ చెయ్యడం అన్యాయం.. ఆ ఆలయంలో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు లేవు. సరైన విచారణ జరపకుండా హుటాహుటిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సబబు? అసలు క్షుద్రపూజలు అనేవి లేవు. ఇలా పాలకమండలిపై ప్రభుత్వం అత్యుత్సాహం ఎందుకు? నిజాలు తేలేదాకా ఆగాలి కదా? నిజాయతీ గల అధికారుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే వారి ఆత్మాభిమానం దెబ్బతీసినట్లే. నిజానికి ఈ సంఘటన ఎన్నో అనుమానాలకు తావు ఇస్తోంది" అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన ఫేస్బుక్ ఖాతాలోనూ ఈ విధంగా పేర్కొన్నారు.
ఓ వ్యక్తి ఒక బుట్టను లోపలికి తీసుకెళ్లి, మళ్లీ బయటకు తీసుకొస్తే క్షుద్రపూజా? అని ప్రశ్నించారు. సూర్యకుమారి దుర్గగుడిలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆమె ఎంతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తని అన్నారు. అసలు క్షుద్రపూజలు అనేవి లేవని, ఒకవేళ అవి ఉన్నవని కొందరు నమ్మితే వాటిని కేవలం శ్మశానాల్లో, ఊరి బయట మాత్రమే చేసుకుంటారని తెలిపారు.