China: చైనా అమ్ములపొదిలోకి హైపర్సోనిక్ మిసైల్.. భారత్, అమెరికాలే టార్గెట్!
- విజయవంతంగా పరీక్షించిన డ్రాగన్ కంట్రీ
- భారత్లోని అణు రియాక్టర్లు, అణుకేంద్రాలు దీని పరిధిలోకి
- జపాన్, అమెరికాలకూ ముప్పే
అత్యంత సూటిగా, వేగంగా లక్ష్యాలను తాకగల హైపర్ సోనిక్ క్షిపణి డీఎఫ్-17 చైనా అమ్ములపొదిలో చేరింది. నవంబరు 1న తొలిసారి, వారం తర్వాత మరోసారి దీనిని పరీక్షించింది. భారత్, అమెరికాలే లక్ష్యంగా దీనిని అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. అలాగే జపాన్లోని కొన్ని కీలక ప్రాంతాలను కూడా ఇది ఛేదించగలదు.
ఈ హైపర్ సోనిక్ గ్లైడెడ్ వెహికల్ (హెచ్జీవీ)ని 2020 నాటికి సైన్యంలోకి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మంగోలియాలోని జియాక్యువాన్ ప్రాంతంలో క్షిపణిని పరీక్షించారు. ఖండాంతర క్షిపణుల కంటే వేగంగా, తక్కువ ఎత్తులో ఇవి ప్రయాణించడం వల్ల నిఘా విమానాలకు ఇవి చిక్కే అవకాశం లేదు. పరీక్ష దశలో ఇది గంటకు 1400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
ప్రపంచంలోని మూడు అతిపెద్ద అణ్వస్త్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనాలు హెచ్జీవీ టెక్నాలజీని ఎప్పుడో సొంతం చేసుకునున్నాయి. భారత్, జపాన్ దేశాల్లోని లక్ష్యాలను ఇవి ఛేదించే అవకాశం ఉండడంతో ఈ రెండు దేశాలకు వీటితో ముప్పు పొంచి ఉన్నట్టే. ఈ క్షిపణిని ఇంటర్సెప్టర్ క్షిపణులు కూడా అడ్డుకోలేవని, కాబట్టి లక్ష్యాన్ని తునాతునకలు చేస్తాయని చైనాకు చెందిన ఓ సైనిక విశ్లేషకుడు పేర్కొన్నారు. భారత్లోని అణు కేంద్రాలు, రియాక్టర్లు కూడా దీని పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు.