Maharashtra: హింసాత్మకంగా మారిన మహారాష్ట్ర బంద్.. స్తంభించిన జనజీవనం!
- రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన అంబేద్కర్ మనవడు ప్రకాశ్
- బంద్‌లో హింసాత్మక ఘటనలు
- జనజీవనం అస్తవ్యస్తం
- సాయంత్రానికి బంద్ విరమిస్తున్నట్టు ప్రకటన
భీమా-కోరెగావ్ యుద్ధం 200వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 1న నిర్వహించిన కార్యక్రమంపై రాళ్లదాడికి నిరసనగా బుధవారం చేపట్టిన మహారాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. భరిపా బహుజన్ మహాసంఘ్ నాయకుడు, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చారు. దీనికి 250 దళిత సంఘాలు మద్దతు తెలిపాయి.
దళితులపై దాడికి నిరసనగా చేపట్టిన బంద్ ముంబై సహా పలు నగరాల్లో హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు సిటీ బస్సులను తగలబెట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు. ముంబైలో 13, పుణెలో 12 బస్సులు వారి దాడిలో ధ్వంసమయ్యాయి. లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. స్కూలు బస్సులు రోడ్డెక్కలేదు. ట్యాక్సీ సేవలు కూడా నిలిచిపోయాయి. మొత్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంద్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో బంద్‌ను విరమిస్తున్నట్టు బుధవారం సాయంత్రం ప్రకాశ్ అంబేద్కర్ ప్రకటించారు. బంద్‌లో హింసాత్మక ఘటనలపై పోలీసులు 9 కేసులు నమోదు చేశారు.