twins: వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు!
- ఇద్దరి మధ్య తేడా 18 నిమిషాలే
- సంవత్సరం మారడంతో పుట్టినతేదీలో తేడా
- అమెరికాలోని కాలిఫోర్నియాలో అరుదైన ఘటన
వాళ్లిద్దరూ కవలలే... కేవలం 18 నిమిషాల తేడాతో జన్మించారు. కానీ వారి పుట్టినతేదీల మధ్య ఏడాది తేడా!.. ఇలా జరగడానికి కారణం కొత్త సంవత్సరం. అవును... అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మరియా ఎస్పరెంజాకు ఇద్దరు కవలలు పుట్టారు. డిసెంబర్ 31, 2017 అర్థరాత్రి 11:58 గంటలకు బాబు జన్మించగా, జనవరి 1, 2018న 00:16 గంటలకు పాప జన్మించింది.
వీరికి జోయాక్విన్ జూనియర్ ఓంటివెరోస్, ఐతానా దె జీసస్ ఓంటివెరోస్ అని పేర్లు పెట్టారు. నిజానికి వీళ్లిద్దరూ జనవరి 27న జన్మించాల్సి ఉందట. అయితే డిసెంబర్ 31నే మరియాకు పురిటి నొప్పులు రావడంతో డెలానో రీజినల్ మెడికల్ సెంటర్కి తీసుకువచ్చారట. అక్కడి డాక్టర్లు ఆమెకు డెలివరీ చేశారట. తమ 35 ఏళ్ల కెరీర్లో ఇలాంటి అరుదైన ఘటన చూడలేదని అక్కడి డాక్టర్లు అన్నారు. అలాగే వారి ఆసుపత్రి సంప్రదాయంలో భాగంగా కొత్త సంవత్సరంలో జన్మించిన మొదటి శిశువులకు 3000 డాలర్లు బహుమతిగా ఇచ్చినట్లు వారు తెలిపారు.