budhet: వేతన జీవులకు బడ్జెట్ లో తీపి కబురు... సెక్షన్ 80సీ పరిమితి పెంచే అవకాశం!
- రూ.2 లక్షలకు పెరగనున్న పరిమితి
- పెంచాలని కోరిన బ్యాంకులు
- బడ్జెట్ లో ప్రకటించే అవకాశం
వేతన జీవులు, వార్షికాదాయం రూ.2.5 లక్షలకు పైగా ఉన్నవారికి కేంద్ర సర్కారు బడ్జెట్ లో తీపి కబురు ప్రకటించనుంది. చట్టంలోని నిబంధనల ప్రకారం వార్షికంగా రూ.2.5 లక్షల ఆదాయానికి ఎటువంటి పన్ను లేదు. ఆ తర్వాత మరో రూ.లక్షన్నర వరకు కొన్ని రకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే దానిపైనా పన్ను ఉండదు. అంటే రూ.4 లక్షల వరకు పన్ను లేకుండా చూసుకునేందుకు వెసులుబాటు ఉంది. అయితే, ఈ సెక్షన్ 80సీ పెట్టుబడులకు ఉన్న రూ.లక్షన్నర పన్ను మినహాయింపును కేంద్రం రూ.2 లక్షలకు పెంచనుందని భావిస్తున్నారు.
ప్రజలు మరింత పెద్ద మొత్తంలో ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించేందుకు పరిమితి పెంచనుందని భావిస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ ముందస్తుగా ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం నిర్వహించగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థల తరఫున హాజరైన ప్రతినిధులు సెక్షన్ 80 సీ కింద ప్రస్తుతమున్న పరిమితిని పెంచాలని కోరారు. దీంతో బడ్జెట్ లో ఈ నిర్ణయం వెలువడనుందని అంచనా వేస్తున్నారు. దేశీయంగా పొదుపు శాతం 2015-16లో 33.3గా ఉంది.