intel: ఇంటెల్, ఏఎమ్‌డీ, ఏఆర్ఎమ్ చిప్‌లలో లోపాలు... రిస్కులో పడనున్న ఫోన్లు, కంప్యూటర్లు!
- లోపాలు కనిపెట్టిన గూగుల్ 'ప్రాజెక్టు జీరో' శాస్త్రవేత్తలు
- మెల్ట్‌డౌన్, స్పెక్టర్ లోపాలుగా గుర్తింపు
- వినియోగదారుడి సమాచారం దుర్వినియోగం?
ఇంటెల్, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్, ఏఆర్ఎం హోల్డింగ్స్ వంటి సంస్థలు తయారు చేసిన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌లలో ఉన్న లోపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వీరి పరికరాలను వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు రిస్కులో పడనున్నట్లు తెలుస్తోంది. ఆల్ఫాబెట్ సంస్థకు చెందిన గూగుల్ 'ప్రాజెక్టు జీరో' శాస్త్రవేత్తలు, ఇతర విశ్వవిద్యాలయాల నిపుణులతో కలిసి చేసిన పరిశోధనలో ఈ విషయాలు తెలిశాయి.
ఈ లోపాలకు మెల్ట్‌డౌన్, స్పెక్టర్ అని పేర్లు పెట్టారు. ఈ మెల్ట్‌డౌన్ లోపం సహాయంతో హ్యాకర్లు సులభంగా కంప్యూటర్లు, ఫోన్లలోని సమాచారాన్ని, పాస్‌వర్డులను తస్కరించే అవకాశం కలుగుతుందని వారు పేర్కొన్నారు. ఇక స్పెక్టర్ లోపం ద్వారా రహస్యంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో చొరబడి అడ్మినిస్ట్రేటర్ పేరు మీద తప్పుడు పనులు చేసే అవకాశం కలుగుతుందని వారు వెల్లడించారు.
అయితే ఈ గూగుల్ 'ప్రాజెక్టు జీరో' శాస్త్రవేత్తల అధ్యయనాన్ని ఇంటెల్, ఏఎండీ సంస్థలు ఖండించాయి. ఇవి తయారీ లోపాలు కావని, మధ్యలో వచ్చినవని, ఓ చిన్న సెక్యూరిటీ ప్యాచ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ లోపాలను సవరించుకునే అవకాశం ఉందని ఆ సంస్థలు తెలిపాయి.