BJP: ఆ దాడులు సంఘ్ పరివార్ శక్తుల బరి తెగింపునకు నిదర్శనం: ఏపీసీసీ నిరసన
- మహారాష్ట్రలోని కొరెగావ్ గ్రామంలో దళితులపై జరిగిన దాడులకు ఏపీసీసీ నిరసన
- 200 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా దివంగత నాయకులను స్మరించుకుంటున్నారు
- బీజేపీ మతతత్వ, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు
దేశవ్యాప్తంగా దళితులను లక్ష్యంగా చేసుకుని జరుగుతోన్న దాడులు సంఘ్ పరివార్ శక్తుల బరి తెగింపునకు నిదర్శనమని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిది వి.గరునాథం అన్నారు. మహారాష్ట్రలోని కొరెగావ్ గ్రామంలో దళితులపై జరిగిన దాడులకు నిరసనగా ఏపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
శాంతియుతంగా 200 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా దివంగత నాయకులను స్మరించుకుంటూ కార్యక్రమాలు చేస్తోన్న దళితులపై అన్యాయంగా బీజేపీ మతతత్వ, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ కార్యకర్తలు కుట్రపూరితంగా దళితులపై దాడులకు తెగబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీసీసీ నేతలు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ అండదండలతోనే ఆహార అలవాట్లను హేళన చేస్తూ ఓ పక్క దళితులను, మరో పక్క మైనార్టీలను చంపుతున్నారని అన్నారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని, దళితులపై దాడులకు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.