High Court: కోడిపందేలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
- రాష్ట్రప్రభుత్వ కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు
- అంగీకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- ఇక కోడిపందేలు కష్టమే!
సంక్రాంతి అనగానే గుర్తొచ్చే వాటిలో కోడి పందేలు ప్రధానంగా ఉంటాయి. తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న ఈ పందేలకు గోదావరి జిల్లాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. లక్షలు, కోట్లలో డబ్బు చేతులు మారే ఈ కోడి పందేల నిర్వహణను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏటా జరుగుతూనే ఉన్నాయి. ఈసారి కూడా కోడి పందేల నిర్వహణను అరికట్టడానికి వీలైనంత మేర కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు కూడా పంపింది. ఈ నోటీసులకు సమాధానంగా గతేడాది 43 మంది తహశీల్దార్లు, 49 మంది పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుచేసింది. అయితే నోటీసులు ఇవ్వగానే సరిపోదని, తదనంతర చర్యలపై కూడా దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ ఏడాది కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది.