kvp ramachander rao: వీటిని బట్టే విభజన హామీలు అమలవలేదని తెలుస్తోంది!: రాజ్యసభలో కేవీపీ విమర్శలు
- ఏపీ పునర్విభజన చట్టాన్ని కేంద్ర సర్కారు అమలు చేయడం లేదు
- మరోవైపు చేస్తున్నామని చెప్పుకుంటోంది
- అమలు చేస్తే లోక్సభలో టీడీపీ ఎంపీలు ప్రైవేట్ మెంబర్ బిల్లులెందుకు వేస్తారు?
ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం సరి అయిన రీతిలో వ్యవహరించడం లేదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ఈ రోజు రాజ్యసభలో జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం గురించి ప్రస్తావించారు. పలు సందర్భాలలో కేంద్ర మంత్రులు విభజన చట్టంలో పేర్కొన్న చాలా విషయాలను అమలు చేశామని చెబుతున్నప్పటికీ అవన్నీ అసత్యాలేనని అన్నారు.
ఇటీవల టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విశాఖపట్నానికి రైల్వే జోను కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఉటంకిస్తూ.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉంటోన్న తెలుగు దేశం ఎంపీలే.. విభజన హామీలు అమలు చేయమని లోక్ సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లులు ఫైల్ చేస్తున్నారని కేవీపీ అన్నారు. వీటిని బట్టే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడం లేదని రుజువు అయిందని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు.