verizon india: హైదరాబాదులో వందలాది ఉద్యోగులను గెంటేసిన ఐటీ సంస్థ.. కలకలం..పోలీస్ కేసు!

  • పోలీసులను ఆశ్రయించిన వెరిజాన్ ఉద్యోగులు
  • 200 మంది ఉద్యోగులను గెంటేసిన వెరిజాన్
  • కఠిన చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు

హైదరాబాద్ మాదాపూర్ ఐటీ కారిడార్ లో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ వెరిజాన్ కంపెనీపై పోలీస్ కేసు నమోదైంది. అమానుషంగా, బౌన్సర్ల అండతో ఉద్యోగుల నుంచి బలవంతంగా రాజీనామాలను స్వీకరించిన నేపథ్యంలో కేసు బుక్ అయింది. కంపెనీ నుంచి తొలగించబడ్డ ముగ్గురు ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. వెరిజాన్ పై సెక్షన్ 506 (క్రిమినల్ తరహా బెదిరింపులు), సెక్షన్ 341 (అమానుష ప్రవర్తన) కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు, వేరిజాన్ చేసిన నిర్వాకం ఐటీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఏకంగా 200 మంది ఉద్యోగులను ఆ సంస్థ బలవంతంగా గెంటేసింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పలు విషయాలను పేర్కొన్నారు. ఉద్యోగులను భయపెట్టి, బలవంతంగా రాజీనామా చేయించారంటూ వారు వాపోయారు. డిసెంబర్ 12, 13 తేదీల్లో ఒక్కొక్కరిని మీటింగ్ రూమ్ కు పిలిపించుకుని... రాజీనామా చేస్తున్నామనే ప్రింటెడ్ పేపర్లను తమ ముందు ఉంచి, బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఆ గదిలో బౌన్సర్లు కూడా ఉన్నారని చెప్పారు.

తమకు కొంత సమయం కావాలని విన్నవించినా అందుకు హెచ్ఆర్ మేనేజ్ మెంట్ తిరస్కరించిందని ఉద్యోగులు తెలిపారు. సీట్లలో నుంచి లేచి బయటకు రాబోయిన తమను బౌన్సర్లు కదలనీయకుండా అదిమిపెట్టారని చెప్పారు. భౌతికంగా హింసించి తమ చేత రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత వస్తువులను తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని... కార్యాలయం నుంచి తమను గెంటి వేశారని చెప్పారు.

సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్ల దురుసు చర్యలు చుట్టుపక్కల భవనాల్లోని సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అయ్యాయని ఉద్యోగులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉందని... ఈ లోగానే ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలించాలని పోలీసులను కోరారు. సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ సంస్థ చెన్నైలోని ఉద్యోగులను కూడా భారీ ఎత్తున తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News