Tollywood: మార్చి 1 నుంచి సినీ పరిశ్రమ షట్ డౌన్: నిర్మాత సి.కల్యాణ్
- క్యూబ్, యూఎఫ్ఓ, జీఎస్టీ సమస్యలపై పోరాటం
- నైజాంలో ముగ్గురివల్ల ఎన్నో సమస్యలు
- చివరకు హీరోలే సినిమాలు తీసుకోవాల్సి వస్తుంది
దక్షిణాది సినీపరిశ్రమను మార్చి 1వ తేదీ నుంచి షట్ డౌన్ చేయబోతున్నామని టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. క్యూబ్, యూఎఫ్ఓతో పాటు జీఎస్టీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని వెతికే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. క్యూబ్, యూఎఫ్ఓల వల్ల ముఖ్యంగా చిన్న సినిమాలు చితికిపోతున్నాయని అన్నారు. జీఎస్టీ అనేది కార్పొరేట్ కంపెనీలు నిర్మించే సినిమాలకు సరిపోతుందేమో కాని, తమలాంటి ఇండివిడ్యువల్ నిర్మాతలకు సరికాదని అన్నారు. సినిమాలు ఆగితే వర్కర్లు, థియేటర్ల వాళ్లు నష్టపోతారనే ఇంత కాలం ఓపికపట్టామని చెప్పారు.
తమ సినీ పరిశ్రమలోనే దొంగలున్నారని... ఎవరి వ్యాపారం వారిదైనప్పటికీ, అందరికీ సమ న్యాయం జరగాలనే పోరాటానికి దిగుతున్నామని కల్యాణ్ చెప్పారు. నైజామ్ మార్కెట్లో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తయారయ్యారని... సినిమాలను వారే కొంటారని, ఇతరులను కొననివ్వరని మండిపడ్డారు. దాని తీవ్రత ఎంతనేది త్వరలోని తెలుస్తుందని, అది అలాగే కొనసాగితే నిర్మాతలు సినిమాలు తీయలేరని చెప్పారు. అప్పుడు హీరోలే వారి సినిమాలు తీసుకోవాల్సి ఉంటుందని... అప్పుడు కష్టాలేంటో వారికి కూడా అర్థమవుతాయని అన్నారు.