North Korea: చర్చలకు సిద్ధమైన ఉ.కొరియా, ద.కొరియా!
- ఈ నెల 9న సమావేశం
- సరిహద్దు ప్రాంతంలోని పెన్ముంజోమ్ గ్రామంలో చర్చలు
- ప్యాంగ్‌చాంగ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వహణపై ఇరు దేశాల చర్చ?
వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ కలకలం రేపుతోన్న ఉత్తర కొరియాపై ఆ దేశ పక్కదేశం దక్షిణ కొరియా ఎంత ఆగ్రహంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని సార్లు ఉత్తరకొరియా భూభాగానికి దగ్గరలో దక్షిణ కొరియా బాంబులు కూడా వేసి యుద్ధానికి సన్నద్ధం అన్నట్లు హెచ్చరికలు చేసింది. ఈ మధ్య ఇరు దేశాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ప్రతినిధులు ఈ నెల 9న సమావేశం కానున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరకొరియాకు చర్చల కోసం దక్షిణకొరియా ఓ విన్నతిని పంపింది. అందుకు ఉత్తరకొరియా ఒప్పుకుంది. ప్యాంగ్‌చాంగ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వహణపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నట్లు తెలిసింది. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతంలోని పెన్ముంజోమ్ గ్రామంలో ఈ చర్చలు జరగనున్నాయి.