Hyderabad: సేమ్ టు సేమ్.. స్వాతి బాటలో జ్యోతి.. నాగరాజు హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

  • స్వాతి మర్డర్ ప్లాన్‌నే అమలు చేసిన జ్యోతి
  • నాగరాజు హత్య కేసులో వీడిన మిస్టరీ
  • జ్యోతి సహా నలుగురు నిందితుల అరెస్ట్

డిసెంబరు 31న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన కార్పెంటర్ నాగరాజు హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఇటీవల సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో భార్య స్వాతి అనుసరించిన విధానాన్నే నాగరాజు భార్య జ్యోతి కూడా అనుసరించింది. ప్రియుడు కార్తీక్ కోసం భర్తను మట్టుబెట్టింది. ప్రియుడు ఇచ్చిన నిద్రమాత్రలను బూస్ట్‌లో కలిపి భర్తతో తాగించింది. భర్త మత్తులోకి జారుకున్న వెంటనే కార్తీక్‌ను ఇంటికి పిలిచింది. కార్తీక్ మరో ముగ్గురు స్నేహితులను తీసుకొచ్చాడు. అందరూ కలిసి నాగరాజు ముఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు.

ఇంటి వెనక నుంచి నాగరాజు మృతదేహాన్ని కారులోకి తరలించారు. తర్వాత చౌటుప్పల్ మండలంలోని జిల్లేడు చెల్ల గ్రామ శివారులో పడేసి వెనక్కి వచ్చారు. తర్వాత జ్యోతి డ్రామాను రక్తికట్టించింది. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. చుట్టుపక్కల వాళ్లను కూడా నమ్మించింది. అయితే నిందితుల్లో ఒకడైన నరేశ్ కేసుకు భయపడి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో కథ అడ్డం తిరిగింది.

రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించడంతో నమ్మశక్యం కాని విషయాలు వెలుగులోకి వచ్చాయి. జరిగింది జరిగినట్టుగా నరేశ్ పూసగుచ్చినట్టు వివరించడంతో పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి కూడా నేరాన్ని అంగీకరించింది. దీంతో నిందితులు కార్తీక్, దీపక్, నరేశ్, యాసిన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాగరాజు-జ్యోతికి ఆరేళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పెళ్లి ముందు నుంచే జ్యోతి-కార్తీక్ మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. మూడు నెలల క్రితం కార్తీక్ ఫోన్ నంబరును తిరిగి సంపాదించిన జ్యోతి పూర్వ ‘పరిచయాన్ని’ కొనసాగించింది. విషయం తెలిసిన భర్త నాగరాజు భార్య జ్యోతిని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించిన జ్యోతి, కార్తీక్ కలిసి హత్య ప్లాన్ రచించారు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News