sushma swaraj: చదువుల తల్లికి వీసా సాయం.. మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న సుష్మా స్వరాజ్!
- విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థినికి సాయం
- వీసా ఇప్పించి తన వంతు సాయం
- అమెరికాలో చదవనున్న రాజస్థాన్ విద్యార్థిని
విదేశీ వ్యవహారాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మంత్రి సుష్మా స్వరాజ్ పరిష్కరిస్తారు. ఆ సమస్య పెద్ద వాళ్లకు వచ్చిందా? సాధారణ ప్రజలకు వచ్చిందా? అని ఆమె ఆలోచించరు. విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్ తీసుకురావాలన్నా, లేదా ఉన్నత చదువుల కోసం ఇక్కడి వారిని విదేశాలకు పంపాలన్నా ఆమె తలచుకుంటే క్షణాల్లో జరిగిపోతుంది. ఇటీవల రాజస్థాన్‌కి చెందిన ఓ విద్యార్థినికి అలాంటి సహాయమే చేసి సుష్మా స్వరాజ్ తనది గొప్ప మనసని మరోసారి చాటుకున్నారు.
జలాల్‌పుర్‌కు చెందిన భానుప్రియ హరిత్వాల్ 10, 12 తరగతుల్లో విశేష ప్రతిభ కనబరిచి.. ఉన్నతవిద్య కోసం రాజస్థాన్ ప్రభుత్వం అందించే కోటి రూపాయల ఉపకారవేతనానికి ఎంపికైంది. కాలిఫోర్నియా స్టేట్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చేయాలని ఆశించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్గత పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించింది.
ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. విదేశాలకు వెళ్లాలంటే వీసా కావాలి.. అందుకోసం ఆమె దరఖాస్తు చేసుకోగా దౌత్య కార్యాలయం 2 సార్లు తిరస్కరించింది. విదేశీ విద్యాలయంలో సీటు సాధించినప్పటికీ వీసా జారీ కాకపోవడంతో వెళ్లలేకపోయింది. దీంతో భానుప్రియ కుటుంబం స్థానిక ఎంపీని ఆశ్రయించింది. ఆయన చొరవ తీసుకుని మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె వెంటనే స్పందించి వీసా వచ్చేలా చేశారు.