north korea: ఎగరలేక సొంత సిటీనే ఢీకొన్న ఉత్తర కొరియా మిస్సైల్!
- గత ఏడాది క్షిపణి ప్రయోగం
- నిమిషాల్లో కుప్పకూలిన మిస్సైల్
- కేవలం 24 నుంచి 43 మైళ్లే పయనించిన క్షిపణి
ఉత్తర కొరియా మిస్సైల్ ప్రోగ్రాంకు సంబంధించిన ఓ విషయం వెలుగు చూసింది. హ్వాసాంగ్-12 అనే మధ్యంతర శ్రేణి క్షిపణి ఒకటి తన గమ్యస్థానాన్ని చేరుకోలేక... మధ్యలోనే కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది ఏప్రిల్ 28న ఈ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా నిర్వహించింది. అయితే లాంచ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ముందుకు సాగలేక, గతి తప్పి ఆ దేశానికి చెందిన టోక్చోన్ అనే సిటీలో కుప్పకూలిపోయింది. ఈ సిటీ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ కు 90 మైళ్ల దూరంలో ఉంది. సిటీలోని జనాభా దాదాపు 2 లక్షలు.
ఈ మిస్సైల్ వల్ల నగరంలో ఉన్న పారిశ్రామిక కాంప్లెక్స్ లేదా వ్యవసాయ కాంప్లెక్స్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం వాటిల్లిందని యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులను ఉటంకిస్తూ డిప్లొమాట్ మేగజీన్ కథనాన్ని ప్రచురించింది. పెక్ ఛాంగ్ ఎయిర్ ఫీల్డ్ నుంచి క్షిపణిని ప్రయోగించారని... ఈశాన్య దిశగా 24 నుంచి 43 మైళ్ల దూరం మాత్రమే ఆ క్షిపణి పయనించిందని కథనంలో పేర్కొంది.
మిసైల్ లాంచ్ అయిన నిమిషం తర్వాత అందులో ఉన్న ఫస్ట్ స్టేజ్ ఇంజన్లు విఫలమయ్యాయని యూఎస్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ద్రవ ఇంధనాన్ని కలిగిన మిస్సైళ్లతో భారీ ఎత్తున పేలుడు సంభవిస్తుందని చెప్పాయి. ఒక బిల్డింగ్ తో పాటు ఓ గ్రీన్ హౌస్ ధ్వంసమైన చిత్రాలు గూగుల్ ఎర్త్ లో కనిపిస్తున్నాయని తెలిపాయి. అయితే, ఈ ఘటన వల్ల సంభవించిన ప్రాణ నష్టాన్ని అంచనా వేయలేమని... ఉత్తర కొరియా అనుసరిస్తున్న సీక్రెట్ విధానమే దీనికి కారణమని మేగజీన్ తెలిపింది.