Chandrababu: మోదీతో చంద్రబాబు భేటీకి అపాయింట్ మెంట్ ఖరారు
- 12వ తేదీన మోదీ, చంద్రబాబుల సమావేశం
- పోలవరం, అసెంబ్లీ సీట్ల పెంపుతో పాటు పలు అంశాలపై చర్చ
- దాదాపు ఏడాది తర్వాత సమావేశం కానున్న నేతలు
ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీకి అపాయింట్ మెంట్ ఖరారయింది. ఈ నెల 12వ తేదీన వీరిద్దరూ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలతో పాటు పలు విషయాలపై వీరిరువురూ చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, అసెంబ్లీ సీట్ల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు, కాపు రిజర్వేషన్ల అంశాన్ని కూడా మోదీ వద్ద చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో, ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ మధ్య కాలంలో ప్రధాని అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నించినా... పీఎంవో నుంచి రిప్లై రాలేదు. తాజాగా చంద్రబాబుతో సమావేశానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ఏపీలో జన్మభూమి కార్యక్రమం జరుగుతుండటంతో... ఆ కార్యక్రమం ముగిసిన మర్నాడే మోదీని కలిసేందుకు తనకు వీలుగా ఉంటుందని చంద్రబాబు చెప్పడంతో, ఆ మేరకు 12వ తేదీ అపాయింట్ మెంట్ ఖరారయింది. ఈ సమావేశాన్ని ప్రధాని కార్యాలయం కూడా ధ్రువీకరించింది. దీంతో, దాదాపు ఏడాది తర్వాత మోదీ, చంద్రబాబులు సమావేశం కానున్నారు.