Chandrababu: గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి: సీఎం చంద్రబాబు
- ‘జన్మభూమి-మా ఊరు’ 5వరోజు నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ లో సీఎం
- రోడ్లు, తాగునీరు, విద్యుత్, విద్య వంటి అన్ని మౌలిక వసతులు ఏర్పడుతున్నాయి.
- అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది
- 4 రోజుల్లో సమస్యలపై 4,68,063 ఫిర్యాదులు
జన్మభూమితో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మూడున్నరేళ్ల నిరంతర శ్రమ ఫలితాలు అన్ని చోట్ల కనిపిస్తున్నాయని తెలిపారు. ‘జన్మభూమి-మా ఊరు’ 5వ రోజు నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘జన్మభూమితో ప్రతి ఊరు రూపురేఖలు మారిపోతున్నాయి. రోడ్లు, తాగు నీరు, విద్యుత్, విద్య, వైద్యం అన్ని మౌలిక వసతులు ఏర్పడుతున్నాయి. మనం చేస్తోన్న పనుల పట్ల ప్రజల్లో పూర్తి సంతృప్తి ఉంది. మూడున్నరేళ్ల నిరంతర శ్రమ ఫలితాలు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి’ అన్నారు.
సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో స్పష్టత వచ్చిందని, వారిలో సానుకూలత పెరిగిందని, ఇది ఎంతో శుభపరిణామమని అన్నారు. జన్మభూమి తొలిరోజున మూడు లక్షల మంది పాల్గొంటే 4వ రోజున 6.54 లక్షల మంది పాల్గొన్నారని, మిగిలిన రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తి కనిపించాలని ఆకాంక్షించారు. గత 4 రోజుల్లో సమస్యలపై 4,68,063 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును రియల్ టైంలో కంప్యూటర్లలో అప్ లోడ్ చేయాలని, రియల్ టైంలో పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు.