america: తప్పుడు హెచ్చరికతో భయాందోళనలకు గురైన అమెరికన్లు!
- సునామీ రాబోతుందంటూ సందేశం
- పోలీసులు అప్రమత్తమై ప్రజలను ఖాళీ చేయించే ప్రయత్నం
- తప్పుడు సందేశమని తెలిసి ఊపిరి పీల్చుకున్న వైనం
అమెరికాలోని ఒరెగాన్ ప్రాంత ప్రజలను ఓ తప్పుడు సందేశం తీవ్రభయాందోళనలకు గురిచేసింది. అక్కడి ఇన్ఫర్మేషన్ అధికారులు చేసిన తప్పిదం వల్ల మరో నాలుగు గంటల్లో సునామీ రాబోతోందని పోలీసులకు సందేశం వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడి ప్రాంత ప్రజలను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. అప్పటికే భయాందోళనలకు గురైన ప్రజలు ఏం చేయాలో అర్థం కాక దొరికిన సామాను దొరికినట్లు పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు బయల్దేరడం ప్రారంభించారు.
కానీ పదిహేను నిమిషాల తర్వాత వచ్చిన సందేశం చూసి, వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకుముందు వచ్చిన సందేశం సాంకేతిక తప్పిదం కారణంగా వచ్చిందని, సునామీ రావడం లేదని, ప్రజలు భయపడవద్దని ఆ సందేశంలో ఉంది. అసత్య వార్త వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నామని ఇన్ఫర్మేషన్ అధికారులు కోరారు.