Drunken Drive: ఢిల్లీలో యాక్సిడెంట్... నలుగురు జాతీయ పవర్ లిఫ్టర్లు మృతి... చావు బతుకుల్లో మాజీ చాంపియన్!
- పొగమంచు, డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదానికి కారణాలు
- వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ యాదవ్ కు తీవ్ర గాయాలు
- అలీపూర్ సమీపంలో ఘటన
దేశ రాజధాని శివార్లలో పొగమంచు నలుగురు జాతీయ పవర్ లిఫ్టర్ల ప్రాణాలను బలిగొంది. ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లే హైవేపై ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా, గత సంవత్సరం మాస్కోలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో వరర్డ్ చాంపియన్ గా నిలిచిన సక్ శ్యామ్ యాదవ్ తీవ్రంగా గాయపడి చావు బతుకుల్లో ఉన్నాడు. మొత్తం ఆరుగురు అథ్లెట్లు, ఢిల్లీ నుంచి పానిపట్ కు కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్ లో బయలుదేరగా, అలీపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
వేగంగా వెళుతూ అదుపుతప్పిన కారు పలుమార్లు పల్టీలు కొట్టి, ఓ విద్యుత్ స్తంభాన్ని బలంగా తాకడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులకు, కొన్ని మద్యం బాటిల్స్ కారులో కనిపించడంతో, పొగమంచుతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కూడా వారి ప్రాణాలను తీసిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో హరీశ్, టింకూ, సూరజ్ అనే అథ్లెట్లు మరణించగా, నాలుగో వ్యక్తిని గుర్తించాల్సి వుంది. గాయపడిన సక్ శ్యామ్ యాదవ్ తో పాటు మరో వ్యక్తిని షాలిమార్ బాగ్ లో ఉన్న మాక్స్ ఆసుపత్రికి తరలించారు.గత సంవత్సరం మాస్కోలో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ అందుకుంటున్న యాదవ్