The Tribune: 'ఆధార్' బండారం బట్టబయలు కానుంది: 'ది ట్రిబ్యూన్' ఎడిటర్
- 100 కోట్ల ఆధార్ కార్డుల వివరాలు లీక్
- సంచలన కథనం రాసిన 'ది ట్రిబ్యూన్' రిపోర్టర్
- బయటకు వచ్చింది చాలా తక్కువన్న రిపోర్టర్ రచనా ఖైరా
దాదాపు 100 కోట్ల ఆధార్ కార్డుల వివరాలు లీక్ అయ్యాయని, సంచలన కథనం రాసిన 'ది ట్రిబ్యూన్' రిపోర్టర్ రచనా ఖైరాను పత్రిక ఎడిటర్ హరీష్ ఖారే అభినందించారు. ఇప్పుడు బయటకు వచ్చింది ఓ పెద్ద మంచుకొండలోని చిన్న ముక్కేనని, మరెంతో బయటకు రానుందని తెలిపారు. ఆధార్ కార్డులపై తప్పుడు ఆరోపణలతో వార్తలు రాశారని రచనా ఖైరాపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. తమ పరిశోధనకు ఫలితంగా ఎఫ్ఐఆర్ రూపంలో ప్రోత్సాహం లభించిందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఖైరా మాట్లాడుతూ, "నేను ఓ విషయం చెప్పదలచుకున్నాను. మా విచారణ మొత్తం పూర్తయింది. ఈ తరహా ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సున్నితత్వాన్ని యూఐడీఏఐ అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకూ మేము వెలుగులోకి తెచ్చిన వివరాలతో పోలిస్తే ఇంకా చాలా సమాచారం మా దగ్గర ఉంది. అతి త్వరలోనే అది కూడా వెల్లడవుతుంది" అన్నారు. తన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ రిపోర్టరుకు అవసరమైన అన్ని రకాల న్యాయ సహాయాన్ని అందిస్తానని ఖారే వెల్లడించారు. కాగా, వార్త రాసిన జర్నలిస్టుపై కేసు పెట్టడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. ప్రజా ప్రయోజనాలు దాగున్న ఓ గొప్ప కథనంపై ఇలా స్పందించడం సరికాదని, ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతమని ఓ ప్రకటనలో ఎడిటర్స్ గిల్డ్ వెల్లడించింది.