Marriage: ముఖ్యమంత్రి గారూ మీరైనా చెప్పరూ.. ‘పెళ్లి కానుక’పై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో ఆసక్తికర చర్చ!
- ఆసక్తికర అంశాన్ని లేవనెత్తిన ఎమ్మెల్సీ అన్నం సతీశ్
- ‘పెళ్లి కానుక’ విషయంలో గొడవలు
- ఎవరికి ఇవ్వాలో చెప్పాలంటూ మొర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆసక్తికర చర్చ జరిగింది. పెళ్లి సమయంలో పేదింటి ముస్లిం మహిళలకు ‘దుల్హన్’, హిందూ మహిళలకు ‘పెళ్లి కానుక’ పేరుతో ఆర్థిక సాయం అందించే పథకం రాష్ట్రంలో అమలవుతోంది. ఈ పథకం విజయవంతంగా అమలవుతున్నా.. పథకంలో భాగంగా అందించే సొమ్ము విషయంలో సమస్యలు వస్తున్నాయని బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీశ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అది మాకు చెందాలంటే, మాకు చెందాలని వధూవరుల కుటుంబాలు ఘర్షణకు దిగుతున్నాయని పేర్కొన్నారు.
పెళ్లి ఖర్చుల కింద ఇస్తున్నారు కాబట్టి తమకే చెందుతుందని అమ్మాయి తరపు వారు, అమ్మాయి కోసం ఇస్తున్నారు కాబట్టి మాకు చెందుతుందని అబ్బాయి తరపు వారు తగువులు పడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను మీరే తీర్చాలంటూ మొరపెట్టుకున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఏ అభిప్రాయం వ్యక్తం చేయకుండా సీనియర్లు కూర్చుని చర్చించి ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయించాలని ఆదేశించారు.