Akhil: హీరో నితిన్, ఆయన సోదరి నిఖితలపై 'అఖిల్' క్రిమినల్ కేసు కొట్టివేత
- 'అఖిల్' హక్కులిస్తామని రూ. 50 లక్షలు తీసుకున్నారు
- ఆరోపించిన సత్యనారాయణ అనే వ్యక్తి
- సివిల్ కేసును క్రిమినల్ కేసుగా చూపారన్న నితిన్ న్యాయవాదులు
- కేసును కొట్టివేసిన హైకోర్టు
నాగ్ తనయుడు అఖిల్ నటించిన 'అఖిల్' చిత్రం హక్కులను ఇస్తామంటూ, రూ. 50 లక్షలు తీసుకున్న నటుడు నితిన్, ఆయన సోదరి నిఖితా రెడ్డి తనను మోసం చేశారని జి సత్యనారాయణ అనే వ్యక్తి దాఖలు చేసిన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. సత్యనారాయణ మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ వేస్తూ, నితిన్, నిఖిత, వారి తండ్రి సుధాకర్ రెడ్డి, శ్రేష్ఠ్ మూవీస్ లను నిందితులుగా పేర్కొని వారు తనను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు.
ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి, వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఈ కేసును కొట్టివేయాలని వేర్వేరుగా నితిన్, నిఖితలు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి తరఫున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదిస్తూ, ఇది చెక్కులకు సంబంధించిన వివాదమని, సివిల్ కేసును క్రిమినల్ కేసుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. దీంతో సత్యనారాయణ దాఖలు చేసిన క్రిమినల్ కేసును కొట్టివేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి తన తీర్పును వెల్లడించారు.