India: ఇండియా దెబ్బకు దిగొచ్చిన చైనా... అరుణాచల్ లో నిర్మాణాలు నిలిపేసినట్టు అధికారిక ప్రకటన!
- అరుణాచల్ తమదేనంటూ రహదారి నిర్మాణం
- యంత్ర పరికరాలను సీజ్ చేసిన భారత సైన్యం
- వెనక్కు తగ్గి రోడ్డు నిర్మాణాన్ని ఆపేసిన చైనా
అరుణాచల్ ప్రదేశ్ లోని ఉప్పర్ సియాంగ్ జిల్లా పరిధిలోని బీసింగ్ ప్రాంతంలో తాము తలపెట్టిన రహదారి నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్టు చైనా ప్రకటించింది. తొలుత ఈ ప్రాంతం తమదని, ఇక్కడ రోడ్డు వేసే హక్కు తమకుందని వాదిస్తూ, చైనా సైన్యం నిర్మాణాలు తలపెట్టగా, యంత్ర పరికరాలన్నింటినీ భారత్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై 6వ తేదీన రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు సమావేశమై చర్చలు జరిపారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా చొరబాటును ఇండియా ఏ మాత్రమూ సహించేది లేదని తేల్చి చెప్పారు.
ఇండియా ఒత్తిడితో దిగొచ్చిన చైనా, ఇక చేసేదేమీ లేక, రహదారి నిర్మాణాన్ని విరమించుకున్నట్టు పేర్కొంది. చైనా కార్మికులు భారత భూభాగంలోకి ప్రవేశించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామని, చైనా దిగొచ్చిందని, దీంతో తాము సీజ్ చేసిన నిర్మాణ రంగ యంత్ర పరికరాలను చైనాకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు.
కాగా, భారత్, టిబెట్ సరిహద్దుకు అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు గత సంవత్సరం డిసెంబర్ 26న చైనా సైన్యం పని మొదలు పెట్టింది. 12 అడుగుల వెడల్పుతో, దాదాపు 600 మీటర్ల దూరం రోడ్డు వేసిన తరువాత భారత్ కల్పించుకుని, అందరినీ అదుపులోకి తీసుకుని, యంత్ర పరికరాలను సీజ్ చేసింది. అయితే, తాము రోడ్డేస్తున్న కార్మికులనే నిర్బంధించామని, చైనా సైన్యం తమకు పట్టుబడలేదని అధికారులు వెల్లడించడం గమనార్హం.