aadhaar: ఆధార్ వివరాలు బయటపెట్టిన జర్నలిస్టుపై కేసు వేయడంపై ఎడ్వర్డ్ స్నోడెన్ ట్వీట్
- అవార్డు ఇవ్వాల్సింది పోయి విచారణ చేపట్టడం సబబుకాదని వ్యాఖ్య
- ప్రజలకు న్యాయం చేకూర్చే ప్రభుత్వం ఇలా చేయదన్న స్నోడెన్
- తప్పు చేసిన వారిని శిక్షించాలని విజ్ఞప్తి
భారతదేశ ప్రజల ఆధార్ వివరాలు హ్యాక్‌కి గురయ్యాయని ద ట్రిబ్యున్ పత్రికలో కథనాన్ని ప్రచురించిన జర్నలిస్ట్ రచనా ఖైరా మీద ఆధార్ సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ స్పందించారు. సమస్యను పరిష్కరించడం మానేసి, సమస్యను గుర్తించిన వారిని నియంత్రించాలనుకోవడం సబబు కాదని స్నోడెన్ వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగాన్ని బయటిపెట్టినందుకు సదరు జర్నలిస్టుకి అవార్డు ఇవ్వాల్సింది పోయి ఇలా విచారణకు ఆదేశించడమేంటని స్నోడెన్ ఓ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
ప్రభుత్వానికి నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే ఇలాంటి చర్యలు తీసుకోదని ఆయన వ్యాఖ్యానించారు. బిలియన్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలను నమోదు చేసే పాలసీలను మార్పు చేయడమో.. లేక దుర్వినియోగానికి పాల్పడి తప్పు చేసిన వారిని శిక్షించడమో చేయాలని స్నోడెన్ సూచించారు. మరోవైపు హ్యాక్‌కి సంబంధించి వార్తలు వచ్చినపుడు కూడా స్నోడెన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ, వ్యక్తిగత వివరాల హ్యాక్‌ని అరికట్టలేరని స్నోడెన్ గత ట్వీట్లో పేర్కొన్నారు.