super computer: దేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్... పూణేలో ఆవిష్కరణ
- ఈ కంప్యూటర్ పేరు ప్రత్యూష్
- వాతావరణ అంచనాల కోసం ఉపయోగం
- 1-6.8 పెటాఫ్లాప్స్ వేగం
దేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌ను పూణేలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటిరియోలజీ(ఐఐటీఎం)లో ఆవిష్కరించారు. ఈ సూపర్ కంప్యూటర్ పేరు 'ప్రత్యూష్'. వాతావరణ వివరాలను, శీతోష్ణస్థితి అంచనాలను మరింత కచ్చితత్వంగా అందించడం కోసం ఈ కంప్యూటర్‌ను ఉపయోగించనున్నారు. దీని ప్రాసెసింగ్ వేగం 1 - 6.8 పెటాఫ్లాప్స్ వరకు ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఐఐటీఎంలోని హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) ఫెసిలిటీలో దీన్ని ఉంచారు. దేశంలో నిర్మించిన మొదటి హెచ్‌పీసీ ఫెసిలిటీ ఇదేనని ఐఐటీఎం తమ ప్రకటనలో పేర్కొంది. ఈ సూపర్ కంప్యూటర్ సహాయంతో తుపానులు, రుతుపవనాలు, సునామీలు వంటి వాటిని అధిక కచ్చితత్వంతో గుర్తించే అవకాశముందని ప్రకటనలో వెల్లడించింది.