newton: గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టింది న్యూటన్ కాదట.. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కొత్త సిద్ధాంతం!
- న్యూటన్ కంటే ముందు రెండో బ్రహ్మగుప్తుడు కనిపెట్టాడట
- పాఠాలు తప్పుగా చెబుతున్నాయన్న మంత్రి
- గతంలో ఆక్సిజన్ ఆవు నుంచి వస్తుందన్న మంత్రి వాసుదేవ్ దేవ్నాణీ
ఆవులు ఆక్సిజన్ విడుదల చేస్తాయని గతంలో వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నాణీ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడారు. పాఠ్యపుస్తకాల్లో చెబుతున్నట్లుగా గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కనిపెట్టలేదని, ఆయన కంటే వెయ్యేళ్ల ముందుగానే రెండో బ్రహ్మగుప్తుడు కనిపెట్టాడని వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ యూనివర్సిటీ 72వ సంస్థాపన దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలో దేవ్నాణీ పాల్గొన్నారు. అక్కడి ప్రసంగంలో భాగంగా ఆయన గురుత్వాకర్షణ గురించిన వివరాలను ప్రస్తావించారు. బ్రహ్మగుప్తుడు చెప్పిన విషయాలనే ఆధునిక శాస్త్రవేత్తలు కొన్ని మార్పులతో సిద్ధాంతాలుగా మారుస్తున్నారని, వాటి ఆధారంగా పాఠాలు తయారై తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నాయని ఆయన అన్నారు.