Andhra Pradesh: ఇంటర్ ప్రాక్టికల్స్ లో ఎగ్జామినర్లనూ జంబ్లింగ్ చేయాలి : ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశం
- ఇంటర్మీడియట్ ఉన్నతాధికారులతో గంటా శ్రీనివాస్ భేటీ
- లోటుపాట్లు లేకుండా ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తాం
- ఒంగోలు ఐఐఐటి క్యాంపస్ కు స్థలం కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటామన్న గంటా
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులతో పాటు ఎగ్జామినర్లను కూడా జంబ్లింగ్ చేసే విధానాన్ని అనుసరించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి. ఉదయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులతో భేటీ మంత్రి అయ్యారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి కంప్యూటర్ ద్వారా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.
ఎథికల్ అండ్ హ్యుమాన్ వాల్యూస్ అంశానికి సంబంధించిన పరీక్ష నిర్వహించే రోజున, ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయం నుంచే ఆ ప్రశ్నాపత్రాన్ని ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, ఈ నెల 20న ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలల మేనేజ్ మెంట్లతో గంటా సమావేశం కానున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు, ఇతర అంశాలపై పలు సూచనలు చేస్తారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ విషయమై ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తో ఈ నెల 23న వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, ఒంగోలు ఐఐఐటి క్యాంపస్ కు స్థలం కేటాయింపుపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు గంటా తెలిపారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, వైస్ చాన్సలర్ తో ఆయన భేటీ అయ్యారు. ఇప్పటికే మూడు స్థలాలను పరిశీలించామని, త్వరలో దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా, ఐఐఐటీలో ఫ్యాకల్టీ భర్తీ అంశం పైనా ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న విశ్వవిద్యాలయాల అధ్యాపకుల భర్తీ మాదిరిగా, కొంత శాతమైనా శాశ్వత ప్రాతిపదికన ఫ్యాకల్టీని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని గంటా హామీ ఇచ్చారు.